డియర్ జగన్ అంటూనే కేవీపీ ....

Update: 2022-09-27 15:30 GMT
వైఎస్సార్ ఆత్మగా ఆయనకు పేరు. ఆయన మౌన మునిగా వైఎస్సార్ ఉన్నపుడు ఉండేవారు. కానీ తరువాత రోజుల్లో ఆయన మాట్లాడడం మొదలెట్టారు. అవసరాన్ని బట్టి పోట్లాడడమూ చేసేవారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఏపీకి సంబంధించిన అనేక సమస్యల మీద  రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కేంద్రంతో పోరాటమే చేశారు.

ఆయన పదవీ కాలం పూర్తి అయింది. ఇపుడు ఆయన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. మీడియాకు కూడా తనకు ఇష్టమైతేనే ఇంటర్వ్యూలు ఇచ్చే కేవీపీ తన ప్రియమైన నేస్తం వైఎస్సార్ కుమారుడు ఏపీకి సీఎం అయినా కూడా ఆయన వైపు రాలేదు. కనీసం మూడేళ్ళ పాలనలో జగన్ కి ఏ విషయం మీద కూడా సలహా ఇచ్చినదీ లేదు.

అలాంటి కేవీపీ రామచంద్రరావు ఇపుడు ఏకంగా ఒక ఘాటు లేఖనే జగన్ మీద సంధించారు. ఆ లేఖలో ఆయన డియర్ జగన్ అంటూ సంభోదిస్తూనే మోడీ సర్కార్ మీద తిరగబడాలంటూ ఒక సందేశాన్ని కూడా వినిపించారు. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. అన్నీ కేంద్రమే చేయాలి. చూడాలి. అలాంటి పోలవరం విషయంలో పొరుగు రాష్ట్రాలు అడ్డంకులు పెడుతూంటే కేంద్రం పట్టించుకోకుండా వదిలేయడెమేంటి అని ఆయన జగన్ కి రాసిన లేఖలో మండిపడ్డారు.

ఈ నెల 29న సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం పొరుగు రాష్ట్రాలతో ఏర్పాటు చేస్తున్న సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన జగన్ కి సొచించారు. విభజన చట్టం ప్రకారం పొరుగు రాష్ట్రాలను ఒప్పించాల్సిన బాధ్యతతో పాటు పోలవరం ముంపు ప్రాంతాల వద్ద కరకట్టలు నిర్మించేలా ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే అని ఆ లేఖలో కేవీపీ స్పష్టం చేశారు.

అందువల్ల ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కేంద్రం మీద వత్తిడి తీసుకువస్తేనే పోలవరం కధ ముందుకు సాగుతుందని కేవీపీ అంటున్నారు. మరి జగన్ కి ఆయన రాసిన తొలి లేఖగా కూడా దీన్ని భావించవచ్చు. అందులో పోలవరం మీద ఆరాటపడుతూ చేసిన విలువైన సూచనలను ఏపీ సర్కార్ పట్టించుకుని కేంద్రం మీద వత్తిడి తెస్తుందా. తన తండ్రి ప్రాణ స్నేహితుడు రాష్ట్రం కోసం కోరుతున్న ఈ కోరికను మన్నించి కేంద్రంతో అవసరం అయితే జగన్ సర్కార్ వత్తిడి పెంచి ఫైటింగ్ కి అయినా సిద్ధపడుతుందా. ఏమో చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News