బీజేపీకి గట్టి షాకిచ్చేలా కేటీఆర్ ట్వీట్

Update: 2020-11-01 16:30 GMT
దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చేలా కేటీఆర్ ట్వీట్ చేశారని చర్చ జరుగుతోంది. కేంద్రం నుంచి తెలంగాణకు అందుతున్న సాయంపై మంత్రి కేటీఆర్ ఈ ట్వీట్ లో కడిగిపారేశారు. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో తెలంగాణకు కేంద్రం నిధులపై టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. కేంద్రం సాయంపై నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల్లో సగం వాటా కేంద్రానిదే అంటూ చెప్పుకొస్తున్నారు. చివరకు టీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లలోనూ కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని అంటున్నారు. దీంతో వాటిని టీఆర్‌‌ఎస్‌ మంత్రులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. అటు మంత్రి హరీష్‌ రావు, ఇటు కేటీఆర్‌‌ కేంద్రంపై కత్తులు నూరుతున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్‌‌ కూడా తాజాగా కేంద్ర ప్రభుత్వం మీద యుద్దం ప్రకటించాలంటూ ప్రకటనలు చేశారు.

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియబోతోంది. మంగళవారం పోలింగ్‌ జరగనుండగా.. ఈనెల 10న ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం చివరి రోజున టీఆర్‌‌ఎస్‌ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. కేటీఆర్‌‌ కొన్ని లెక్కలను ట్విట్టర్‌‌ వేదికగా బయటపెట్టారు. కేంద్రంలోని బీజేపీ నుంచి తెలంగాణకు అందుతున్న సాయంపై వివరించారు.

2014 నుంచి పన్నుల రూపంలో కేంద్రం 2,72,926 కోట్లు ఇచ్చిందని అంటున్నారని.. అయితే తెలంగాణకు కేవలం 1,40,329 కోట్లు మాత్రమే వచ్చాయని కేటీఆర్ లెక్కలు బయటపెట్టారు. భారత ఆర్థిక రంగాభివృద్ధికి తెలంగాణ గొప్ప పాత్ర పోషిస్తోందని చెప్పుకొచ్చారు. తెలంగాణ నుంచి కేంద్రం డబ్బులు తీసుకుంటూ పైసా విదిల్చడం లేదంటూ బీజేపీని ఇరుకునపెట్టారు.
Tags:    

Similar News