''నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయండి''
హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకుడు నవీన్ యాదవ్ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే.;
హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకుడు నవీన్ యాదవ్ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఊహించని మెజారిటీతో ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. వాస్తవా నికి పార్టీ నాయకులు.. 20 వేల ఓట్ల మెజారిటీ దక్కుతుందని అనుకున్నా.. ఆయనకు 24,729 ఓట్ల మెజారిటీ దక్కింది. దీంతో గత మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యే అనిపించుకోవాలని ప్రయత్నించిన నవీన్ యాదవ్ .. ఎట్టకేలకు ఉప పోరులో తన కలను సాకారం చేసుకున్నారు. అయితే.. తాజాగా ఆయన ఎన్నికపై హైకోర్టులో కేసు దాఖలైంది.
ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్న నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ.. బీఆర్ఎస్ నాయకురాలు.. ఈ ఉప ఎన్నికలో ఆపార్టీ తరఫున పోటీ చేసి పరాజయం పాలైన మాగంటి సునీత హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం.. ఆమె ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఈ వార్త వెలుగు చూసే సరికి చాలా ఆలస్యం కావడం గమనార్హం. వాస్తవానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం బీఆర్ ఎస్‌దే. 2023లో జరిగిన ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ బీఆర్ ఎస్ తరఫున విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ ఏడాది ఆయన అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఉపపోరు అనివార్యమైంది.
రీజనేంటి?
మాగంటి సునీత .. ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌పై హైకోర్టును ఆశ్రయించడానికి రీజన్.. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో వివరాలను తప్పుగా ఇచ్చారన్నదే!. చదువు, ఆదాయం, ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చి.. ఎన్నికల సంఘాన్ని తప్పు దోవ పట్టించారని సునీత తన పిటిషన్‌లో కోరారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచారని.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. ఇంటింటికీ వస్తువులు ఇచ్చారని, తద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని కూడా సునీత తన పిటిషన్‌లో వివరించారు. మొత్తం 22 పేజీల పిటిషన్‌లో పలు విషయాలు పేర్కొన్నారు. కాగా.. ఈ పిటిషన్ బుధవారం లేదా.. శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఆమె తరపు న్యాయవాది తెలిపారు.