పీపీపీ మీద అరెస్టు.... చెల్లుబాటు అవుతుందా ?
పీపీపీ అంటే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యమని అర్ధం. ఇది కొత్త కాదు, వింత అంతకంటే కాదు.;
పీపీపీ అంటే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యమని అర్ధం. ఇది కొత్త కాదు, వింత అంతకంటే కాదు. దేశంలో అనేక రాష్ట్రాలు పీపీపీ మోడ్ ని అనుసరిస్తూ ముందుకు పోతున్నాయి. కేంద్రంలో ప్రభుత్వాలు కూడా ఇదే అనుసరిస్తున్నాయి. పీపీపీ అంటే అది నేరమో ఘోరమో కానే కాదు, కానీ ఏపీలోనే ఎందుకు ఇది పెద్ద డిస్కషన్ అవుతోంది. రాజకీయ రచ్చ అవుతోంది అన్నదే అంతా చర్చించుకుంటున విషయం. ఏపీలో 17 మెడికల్ కాలేజీలు జగన్ హయాంలో మంజూరు అయ్యాయి. వాటిలో నాలుగైదు వైసీపీ హయాంలో ముందుకు సాగాయి. మిగిలినవి చేయాలీ అంటే నిధుల సమస్య ఉంది. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. దానికి వైసీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.
పీపీపీ మోడ్ :
ఇక దేశంలో చూస్తే మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్ లో నిర్మాణం చేయడం అన్నది జరుగుతోంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు ఇక్కడ ఉంటాయి. ప్రైవేట్ సంస్థలకు కళాశాలలను నిర్మించడం, నిధులు సమకూర్చడం, నిర్వహించడం వంటి బాధ్యతలు అప్పగిస్తారు. ఇక ఇవి జిల్లా ఆసుపత్రులతో అనుసంధానించబడి ఉంటాయి. పైగా నీతి అయోగ్ తో పాటు జాతీయ మెడికల్ కౌన్సిల్ మార్గనిర్దేశం చేసే నియమాలు అనుసరించి ఉంటాయి. ఇక వీజీఎఫ్ అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో పాటు దీర్ఘకాలిక లీజులు కూడా ఉంటాయి. ఉదాహరణకు చూస్తే 33 సంవత్సరాలకు లీజు అన్న మాట. అలాగే 150 దాకా ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ ప్రైవేట్ వాటా ఉంటుంది. బెడ్ ఆక్యుపెన్సీ చూస్తే ప్రభుత్వ రోగులకు 70 శాతం ఉంటుంది అని చెబుతున్నారు.
నీతి ఆయోగ్ మార్గదర్శకాలు:
డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ అన్న విధానం ద్వరా అంతర్జాతీయ ఉత్తమ పద్ధతుల ఆధారంగా పీపీపీ ఒప్పందాన్ని చేసుకుంటారు. జాతీయ వైద్య కమిషన్ నిబంధనలు చూస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో కళాశాల స్థాపనకు 300 ప్లస్ పడకలు ఉండాలని ఉంది. ఇప్పటికే ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తూ పీపీపీలను ఇక్కడ అనుమతించ వచ్చు. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే లీజు ఆస్తి బదిలీ కింద ప్రైవేట్ భాగస్వాములని చేర్చుకుంటున్నారు. క్యాంపస్‌లు అలాగే ఆసుపత్రులను నామమాత్రపు ధరలకు దీర్ఘకాలిక లీజుకు ఇస్తారు. గడువు పూర్తి అయిన తరువాత కళాశాలలను ఆసుపత్రిని తిరిగి ప్రభుత్వానికి పీపీపీ విధానంలో అప్పగిస్తారు.
ఎవరికి ఏమిటి :
ప్రైవేట్ బాధ్యతలు చూస్తే డిజైన్, నిర్మాణం, ఆర్థిక సహాయం, నిర్వహణ, నాణ్యతను నిర్ధారించడం, సాంకేతిక సమగ్రత వంటివి ఉంటే ప్రభుత్వ బాధ్యతలుగా భూమి కేటాయింపు, చట్టబద్ధమైన ఆమోదాలు, బీమా పథకాలకు ఎంప్యానెల్‌మెంట్, పడకల ఆక్యుపెన్సీని నిర్ధారించడం వంటివి ఉంటాయి. సాధారణంగా ఒక్కో కళాశాలకు 150 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇందులో రేషియో ప్రకారం ప్రభుత్వానికి సీట్లు దక్కుతాయి ఈ నిబంధనలు ప్రజా శ్రేయస్సు కోసం ప్రైవేట్ సామర్థ్యాన్ని పెంచడం, నాణ్యమైన వైద్య విద్య సరసమైన ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడం వంటి వాటి కోసం ఏర్పాటు చేసుకున్నవి. ఇక టెండర్లను చట్టబద్ధంగానే ప్రభుత్వం పిలుస్తుంది. అలాగే బిడ్లను దాఖలు చేసేందుకు కూడా సదరు ప్రైవేట్ సంస్థలకు చట్టబద్ధమైన హక్కు ఉంది. ప్రభుత్వం చెప్పిన దానికి అంగీకరించి పీపీపీ కి అంగీకరించే సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ ఉండే ప్రసక్తి లేదు. మరి పీపీపీల విషయంలో జైలులో పెడతామని వైసీపీ అంటోంది. అది సాధ్యమేనా అంటే కాదనే మాట అయితే నిపుణుల నుంచి ఉంది. కానీ ఇది మాత్రం జనంలో చర్చగా ఉంది. మరి నిజంగా ఆ విధమైన స్కోప్ ఉందా అంటే ఇది రాజకీయపరమైన హెచ్చరికగా చూడాలా అన్నది ఒక బిగ్ డిబేట్ గానే ఉందిపుడు.