అసెంబ్లీ ఆరు రోజులే.. బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే!
ఇక, బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ కూడా.. సభలో సంప్రదాయాన్ని కొనసాగిస్తే మంచిదేనన్నారు. కానీ, ప్రజల సమస్యలపై మాత్రం గత గళం వినిపిస్తానని చెప్పారు.;
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ల మధ్య సభలో ఆత్మీయ పలకరింపులు హైలెట్ అయ్యాయి. దీంతో సభా సమావేశాలు శాంతియుతంగానే జరిగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావించారు.కానీ, ఈ పలకరింపు ఫార్మలేనని.. అంశాల వారీగా చర్చ జరిగినప్పుడు ఉన్నది ఉన్నట్టే అడుగుతామని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక,బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ కూడా.. సభలో సంప్రదాయాన్ని కొనసాగిస్తే మంచిదేనన్నారు. కానీ, ప్రజల సమస్యలపై మాత్రం గత గళం వినిపిస్తానని చెప్పారు.
అయితే.. ఆదిలోనే ఇరు పక్షాల మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. తొలిరోజు సభ.. తొలిభాగం ముగిసిన తర్వాత.. బిజినెస్ అడ్వయిజరీ సమావేశం నిర్వహించారు. దీనిలో సభలో చర్చించే అంశాలు.. ప్రవేశ పెట్టే బిల్లులు(కాన్ఫిడెన్షియల్) వంటి వివరాలను అధికార, ప్రతిపక్ష సభ్యులు పంచుకుంటారు. అనంతరం.. ప్రతిపక్షం కూడా తమ డిమాడ్లను చర్చిస్తుంది. ఈ క్రమంలోనే సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? అనే విషయంపైనా ఉభయ పక్షాలు కూడా చర్చిస్తాయి. ఈ క్రమంలో తాజాగా బీఆర్ ఎస్-అధికార కాంగ్రెస్‌ల మధ్య ఇదే విషయం చర్చకు వచ్చింది. కానీ, నిర్ణయంలో అధికార పక్షానిదే పైచేయి అయింది.
ప్రస్తుత సభలోను 15 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ ఎస్ తరఫున ఎమ్మెల్యే హరీష్‌రావు గట్టిగా డిమాండ్ చేశారు. అది కూడా సెలవులు తీసేసి.. 15 రోజులు జరపాలని.. చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నారు. కానీ.. ప్రభుత్వ పక్షం మాత్రం కేవలం 6 రోజలు మాత్రమే సభను నడిపేందుకు సిద్ధమైంది. జనవరి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు.. ఆరు రోజులు మాత్రమే సభా నిర్వహణకు బీఏసీ సిద్ధమైంది. దీనికి స్పీకర్ కూడా ఓకే చెప్పడంతో దీనినే నిర్ధారించారు. డిసెంబరు 29న సభ ప్రారంభమైనా.. 30, 31, 1వ తేదీలను సెలవుగా ప్రకటించి.. జనవరి 2 నుంచి7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కాగా.. ప్రజల సమస్యలు చర్చించడం ఇష్టంలేకనే అధికార పక్షం సమావేశాలను కుదించిందని హరీష్‌రావు విమర్శించారు.