ఏపీలో ‘పంచాయతీ’ ఇప్పట్లో లేనట్టేనా..? కారణమేంటి!
రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాలకు 2026 ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువు ఉంది.;
ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదని చెబుతున్నారు. గడువుకన్నా ముందే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా, కొన్ని కారణాల వల్ల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. పంచాయతీల పునర్విభజన, విలీనం పూర్తికాకపోవడం కూడా ఎన్నికల నిర్వహణకు అడ్డుగా మారిందని అంటున్నారు. ప్రధానంగా వచ్చేనెల 2వ తేదీ నుంచి జనగణన ప్రారంభమవుతున్నందున పంచాయతీల విభజన జరగడం లేదని, ఆ కారణంగా ఎన్నికలు నిర్వహించే ఆలోచనను కూడా ప్రభుత్వం మార్చుకుందని అంటున్నారు.
రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాలకు 2026 ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువు ఉంది. పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన వరకు ఆ పంచాయతీ పరిధిలో మార్పులు, చేర్పులు చేయడం చట్టపరంగా కుదరదని చెబుతున్నారు. ఈ కారణంగా జనవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచన మార్చుకుని.. పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాతే ఎన్నికలు పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ తాజా ఆలోచనల ప్రకారం వచ్చే ఏడాది జూన్ లేదా జులై నెలల్లోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
వాస్తవానికి పంచాయతీలకు మూడు నెలలు ముందుగా అంటే జనవరిలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఆ మేరకు ఎన్నికల సంఘానికి సూచనలు ఇచ్చింది. ఎన్నికల సన్నాహాలులో భాగంగా ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల కేంద్రాల గుర్తింపు వంటి ముందస్తు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఎన్నికల కమిషన్ సైతం జనవరిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే రాజకీయంగా కొన్ని నిర్ణయాలను అమలు చేయాల్సివున్నందున ప్రభుత్వం ‘పంచాయతీ’పై పునరాలోచన చేసిందని అంటున్నారు.
గత ప్రభుత్వంలో పంచాయతీ పాలకవర్గాలు ఉన్నంతకాలం భౌగోళిక మార్పులు చేయరాదని చట్టం చేశారు. ప్రస్తుతం పంచాయతీల పునర్విభజనకు ఈ చట్టమే అడ్డంకిగా మారిందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ పంచాయతీలను ఏకపక్షంగా గెలుచుకుంది. ఇప్పుడు కూటమి కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి టీడీపీ, జనసేన నేతల నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. కొన్ని పంచాయతీల్లో విపక్షం బలంగా ఉందన్న కారణంగా వాటిని రెండుగా విడగొట్టడం లేదా సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తున్నారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా 150 ప్రతిపాదనలు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గత ప్రభుత్వం చేసిన చట్టం కారణంగా న్యాయవివాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున ఏప్రిల్ 2వ తేదీ వరకు వేచివుండాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. అదే సమయంలో ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీకాలం కూడా పూర్తవుతుందని, కొత్త కమిషనర్ ద్వారానే ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వ ఆలోచనకు కూడా వీలు దొరికినందున జూన్ లేదా జులైలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.