నెట్టింత కొత్త సందడి... ప్రియాంక కొడుకు పెళ్లి, రాహుల్ గాంధీపై లొల్లి..!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నాయకుడు, గాంధీ కుటుంబ వారసుడు, దేశ రాజకీయాల్లో కీలక నాయకుడు అయిన రాహుల్ గాంధీకి తాజాగా ఓ పెద్ద సమస్య వచ్చి పడిందని అంటున్నారు.;

Update: 2025-12-30 12:56 GMT

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నాయకుడు, గాంధీ కుటుంబ వారసుడు, దేశ రాజకీయాల్లో కీలక నాయకుడు అయిన రాహుల్ గాంధీకి తాజాగా ఓ పెద్ద సమస్య వచ్చి పడిందని అంటున్నారు. వాస్తవానికి తన కుటుంబంలో ఓ వేడుకకు రంగం సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న వేళ.. ఇది ఒక రకంగా రాహుల్ ఫుల్ గా సందడి చేసే సందర్భమే అయినప్పటికీ.. ఓ విషయంలో మాత్రం ఇరకాటం అని అంటున్నారు.

అవును... డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్లిపోతే.. రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రియాంక గాంధీ - రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రెహాన్ వాద్రా కు తన స్నేహితురాలైన అవీవా బేగ్ తో నిశ్చితార్ధం జరిగిందని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. లేదు లేదు.. నూతన సంవత్సర వేడుకల అనంతరం, జనవరి మొదటి వారంలోనే రాజస్థాన్ వేదికగా వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని మరో ప్రచారం జరుగుతుంది.

సరే.. వేదిక ఏదైనా.. తేదీ కాస్తా అటు ఇటుగా మారినా.. రెహాన్ - అవీవాల ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. ఎంగేజ్మెంట్ అనంతరం వీలైనంత తొందరలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని చెబుతున్నారు. అంటే... ప్రియాంక గాంధీ కుమారుడికి వివాహం జరగబోతుందన్నమాట. అయితే.. మేనల్లుడి పెళ్లి అయిపోతున్న వేళ... హాఫ్ సెంచరీ దాటిన మేనమామ పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు నెట్టింట మొదలైన కొత్త లొల్లి!

1970 జూన్ 19న జన్మించిన రాహుల్ గాంధీ వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. న్యూఢిల్లీలో ప్రాథమిక విద్యతో మొదలుపెట్టిన రాహుల్ గాంధీ... ఫ్లోరిడాలోని రోలిన్స్ కళాశాల నుంచి డిగ్రీ, కేంబ్రిడ్జ్ నుండి ఎం.ఫిల్ పూర్తి చేశారు. అనంతరం.. లండన్ లోని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన మానిటర్ గ్రూపులో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భారత్ కు తిరిగి వచ్చి ముంబైలో టెక్నాలజీ అవుట్ సోర్సింగ్ సంస్థను స్థాపించారు.

ఈ క్రమంలో 2000లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఇండియన్ యూత్ కాంగ్రెస్ కు నాయకత్వం వహించారు. మరోవైపు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్టుకు ట్రస్టీగానూ ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్.. 2024 జూన్ నుంచి లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అయితే... ఆయన ఇప్పటికీ వివాహం చేసుకోకపోవడంతో అప్పుడప్పుడూ రాజకీయ ప్రత్యర్థులతో పాటు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తుంటారు.

ఇక, తాజాగా ఆయన మేనల్లుడి వివాహం విషయం కూడా తెరపైకి రావడంతో.. ఈ పేరు చెప్పి రాహుల్ గాంధీపై కామెంట్లు, సలహాలు, సూచనల ఒత్తిడి ఎక్కువగానే ఉండొచ్చని అంటున్నారు. ‘వెన్ ఆర్ యూ గెట్టింగ్ మ్యారీడ్ రాహుల్ జీ?’ అనే ప్రశ్నలు ఇప్పుడు వైరల్ అవ్వబోతున్నాయని చెబుతున్నారు. మరి ఈ ప్రశ్నకు రాహుల్ నుంచి సమాధానం వస్తుందా.. లేక, ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News