సీమాంధ్ర ఓట‌ర్ల‌ను మ‌రీ ఇంత‌గా బ్ర‌తిమిలాడాలా కేటీఆర్‌.

Update: 2018-10-29 06:48 GMT
కేసీఆర్ కుమారుడిగా.. ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా అంద‌రూ చెప్పుకునే తాజా మాజీ మంత్రి కేటీఆర్ నోటి నుంచి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. కేసీఆర్ మాదిరే మంచి వ‌క్త‌గా చెప్పుకునే కేటీఆర్ నోరుజారుడు అంటూ ఉండ‌దు. అలాంటి కేటీఆర్ సైతం తాజాగా చేసిన వ్యాఖ్య‌లతో ఇబ్బంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

సీమాంధ్రులు ఎక్కువ‌గా ఉంటార‌ని చెప్పే నిజాంపేట‌లో ఆయ‌న ఏర్పాటు చేసిన స‌భ‌లో.. అక్క‌డి వారిని ఉద్దేశించి మాట్లాడిన మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. సెటిల‌ర్ల ( ఈ ప‌దాన్ని ఉప‌యోగించ‌న‌ని.. అలా ఎవ‌రూ లేర‌ని.. అంద‌రూ తెలంగాణ బిడ్డ‌లేన‌ని కేసీఆర్ చెప్పినా.. ఆ స‌భ‌లో పాల్గొన్న వారు.. ముఖ్యంగా కేటీఆర్‌ చేసిన వ్యాఖ్య‌ల దృష్ట్యా ఈ మాట‌ను వాడాల్సి వ‌స్తోంది) మ‌న‌సుల్ని దోచుకునేలా కేటీఆర్ వ్యాఖ్య‌లు చేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎందుకంత ఆస‌క్తి అంటే.. కేసీఆర్ కొడుగ్గా.. టీఆర్ ఎస్ నాయ‌కుడిగా తాను హామీ ఇస్తున్నాన‌ని.. "ఇక్క‌డ ఉండే రాయ‌ల‌సీమ‌.. కోస్తాంధ్ర ప్ర‌జ‌ల‌కు తాను విజ్ఞప్తి చేస్తున్నానంటూ.. మీరుంద‌రూ న‌న్ను సోద‌రుడిగా భావించండి. మీ అంద‌రికి వ్య‌క్తిగ‌తంగా అండ‌గా ఉంటాన‌ని కేసీఆర్ కుమారుడిగా.. టీఆర్ ఎస్ నాయ‌కుడిగా హామీ ఇస్తున్నా. పొర‌పాటున మీ మ‌న‌సులో ఏమైనా అనుమానాలుంటే వాటిని ప‌క్క‌న పెట్టండి" అని వ్యాఖ్యానించారు.

గ‌డిచిన కొద్ది రోజులుగా కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌లు సీమాంధ్రుల్ని ఉద్దేశించి కాద‌ని.. ఆయ‌న విమ‌ర్శించింది చంద్ర‌బాబునేన‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబుతో టీఆర్ఎస్‌కు అభ్యంత‌రాలు ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని.. వాటిని ప్ర‌జ‌లు త‌మ‌కు ఆపాదించుకోవ‌ద్ద‌ని కోరారు.

ఇలా సీమాంధ్రుల మ‌నసుల్ని దోచుకునేలా మాట్లాడే క్ర‌మంలో ఆయ‌న  మ‌రిన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘‘ఉద్విగ్నంగా, ఉద్వేగపూరితంగా మాటల తూటాలు పేల్చుకున్నప్పుడు కొంత నొప్పి కలిగినట్లు అనిపిస్తుంది. దాన్ని నేను కాద‌న‌టం లేదు.కానీ, రాజకీయాల్లో చంద్రబాబు ప్రత్యర్థి కాబట్టి ఆయనపై విమర్శలు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్‌కు ఆక్సిజన్‌ అందిస్తున్నది.. చచ్చిన పామును లేచి నిలబెడుతున్నదీ చంద్రబాబే. అప్పుడు టీడీపీలో, ఇప్పుడు కాంగ్రె్‌సలో ఉన్న నేత మన ఎమ్మెల్యేల కొనుగోలుకు వెళ్లడం వాస్తవం. ప్రాజెక్టులకు చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపండి.. హైదరాబాద్‌ కు నీళ్లు తెచ్చే ఆ ప్రాజెక్టును నిలిపివేయండని కేంద్రానికి లేఖలు రాశారు"  అని వ్యాఖ్యానించారు.

కేటీఆర్ చేసిన మ‌రిన్ని వ్యాఖ్య‌లు ఏమంటే..

+  ప్రాజెక్టుల‌ను ఆపాలంటూ లేఖలు రాయడంలో చంద్రబాబు తప్పేమీ లేదని, దిగువ రాష్ట్రం కాబట్టి.. ఎగువన ఉన్న వారు ప్రాజెక్టులు కట్టుకుంటే నీళ్లు రావేమోనని లేఖలు రాసి ఉండవచ్చని, కానీ, ఆ విషయంలో తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు.

 +  హరికృష్ణ చనిపోయినప్పుడు ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో చూశారు కదా!  కేసీఆర్‌, నేను స్వయంగా వెళ్లి పరామర్శించాం. ‘ఆ సమయంలో చంద్రబాబు అక్కడ కూర్చుని ఉన్నారు. అప్పుడే టీడీపీ - టీఆర్ ఎస్‌ కలిసి ఉంటే బాగుంటుందేమో అన్నారు. అది సాధ్యపడకపోవచ్చు సార్‌ అని నేను చెప్పాను.

+ మా భవిష్యత్తు ఆంధ్రాలోనేనని - తెలంగాణపై ఇంట్రస్ట్‌ లేదని గతంలో మీరు చెప్పారు. ఇప్పుడు మరొకటి చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఉండాలని - ఆధిపత్యం కొనసాగాలని అంటే ఆంధ్రా - తెలంగాణ మధ్య వైరుధ్యాలు వస్తాయి. నీళ్లు - ఇతర విషయాల్లో తగాదాలు వస్తాయి. మీరు మా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించింది వాస్తవం. ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది వాస్తవం. ఇన్ని వైరుధ్యాల మధ్య పొత్తు సాధ్యం కాదని చెప్పాను.

 +  తెలంగాణ వచ్చే వరకే మా గొడవ. గొడవలు - గిల్లికజ్జాలు - ఆస్తులు లాక్కునే పనులు ఉండవని 2014కు ముందు చెబితే మమ్మల్ని నమ్మలేదు. కానీ, 16 నెలల్లో జీహెచ్ ఎంసీ ఎన్నికల నాటికే అనుమానాలు పటాపంచలయ్యాయి. నాలుగున్నరేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నడిపిన తీరు మీ కళ్ల ముందు ఉంది. ప్రాంతీయ వివక్ష మచ్చుకైనా ఉందా? ఒక్క గొడవ జరిగిందా?


Tags:    

Similar News