చార్మినార్ స్థాయిలో ఇమేజ్ ట‌వ‌ర్‌!

Update: 2017-11-06 05:03 GMT
చేసే ప‌నుల‌ను చెప్పుకోవ‌టం కూడా ఒక అర్టే. ఆ విష‌యంలో నూటికి నూరు మార్కులు ప‌డ‌తాయి తెలంగాణ స‌ర్కారుకు. చేసే దానికి మించి చెప్పుకోవ‌టంలో టీఆర్ఎస్ అండ్ కోకు సాటి రారెవ్వ‌రు. తాజాగా అలాంటి మాట‌నే చెప్పారు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌. తెలంగాణ రాష్ట్రంలో యానిమేష‌న్‌.. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌.. గేమింగ్ అండ్ కామిక్స్ ప‌రిశ్ర‌మ‌కు ఊత‌మిచ్చేలా  భారీ ట‌వ‌ర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ట‌వ‌ర్ చార్మినార్ మాదిరి తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్ర‌తిష్ట‌లు తెచ్చి పెడుతుంద‌న్నారు. సృజ‌నాత్మ‌క రంగాల‌కు హైద‌రాబాద్‌ను కేంద్రంగా మారుస్తామ‌న్న కేటీఆర్ అందులో భాగంగానే ఇమేజ్ ట‌వ‌ర్ నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టిన‌ట్లుగా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాయ‌దుర్గంలోని ప‌ది ఎక‌రాల స్థ‌లంలో ఇమేజ్ ట‌వ‌ర్ నిర్మాణ ప‌నుల‌కు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు.

పీపీపీ  (ప్రైవేట్‌.. ప్ర‌భుత్వ భాగ‌స్వామ్యం) ప‌ద్ధ‌తిలో రూ.945 కోట్ల వ్య‌యంతో ఇమేజ్ భ‌వ‌నాన్ని రూపొందించ‌నున్న‌ట్లు కేటీఆర్ చెప్పారు. మ‌రో మూడేళ్ల‌కు (2020) పూర్తి కానున్న ఈ భ‌వ‌నంతో 16 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల మేర మోకాప్ స్టూడియోలు.. ట్రీన్ మ్యాట్ స్టూడియోలు.. సౌండ్స్ అండ్ అక్విస్టిక్ స్టూడియోలు.. క‌ల‌ర్ కోడిండ్ అండ్ డీఐ స్టూడియోలు.. రెండ‌ర్ పార‌కిమ్స్‌.. డాటా సెంట‌ర్స్ ఇలా ఎప్పుడూ విన‌ని చాలా పేర్లతో కూడిన సేవ‌లు అందుబాటులోకి రానున్న‌ట్లు వెల్ల‌డించారు.

గేమింగ్‌..యానిమేష‌న్ ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధికి ఈ భ‌వ‌నం చోద‌క‌శ‌క్తిగా మారుతుంద‌ని.. ఏవీజీసీ రంగానికి సంబంధించి స‌క‌ల స‌దుపాయాల‌ను ఒకే గొడుగు కింద అందించ‌టం ఆసియా.. ప‌సిఫిక్‌ దేశాల్లో ఇది తొలిసారి అవుతుంద‌ని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. యూకే లోని మీడియా సిటీ.. సియోల్ లోని డిజిట‌ల్ సిటీల‌ను త‌ల‌ద‌న్నేలా ఇమేజ్ ట‌వ‌ర్ ఉంటుంద‌న్న కేటీఆర్ మ‌రో ఆస‌క్తిక‌ర అంశాన్ని చెప్పుకొచ్చారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఏ మూల నుంచి చూసినా టీ అక్ష‌రం ఆకారం క‌నిపించేలా ఇమేజ్ ట‌వ‌ర్ ఉంటుంద‌న్నారు. ఈ ట‌వ‌ర్ ఏర్పాటుతో గేమింగ్‌.. యానిమేష‌న్ రంగాల్లో ఉద్యోగ అవ‌కాశాలు భారీగా పెరుగుతాయ‌న్నారు.

డిగ్రీ స్థాయిలోనే అన్ని ఫైన్ ఆర్ట్స్ కోర్సులు.. ఐటీఐ.. ఇత‌ర నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ కోర్సుల్లో యానిమేష‌న్ గేమింగ్ ల‌ను చేరుస్తామ‌న్నారు. యానిమేష‌న్.. గేమింగ్‌ రంగాల్లో స్టార్టప్ ను ప్రోత్స‌హించేందుకు వీలుగా 27వేల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లంలో ఇన్ క్యుబేట‌ర్ ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. దేశంలో గేమింగ్‌ప‌రిశ్ర‌మ‌కు చాలానే అవ‌కాశాలు ఉన్నాయ‌ని.. అయినా ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ స్టూడియోలు..2డీ.. 3డీ యానిమేష‌న్స్.. గేమింగ్ రంగాల‌కు చెందిన 100 ప‌రిశ్ర‌మ‌లు హైద‌రాబాద్ లో ఉన్నాయ‌ని 35 వేల మంది వృత్తి నిపుణులు ఇక్క‌డ ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పారు.

దేశ సినిమాపై ప్ర‌భావం చూపిన బాహుబ‌లికి విజువ‌ల్ ఎఫెక్ట్స్ హైద‌రాబాద్ నుంచి అందించార‌ని.. ఇవేకాక హాలీవుడ్ మూవీ లైఫ్ ఆఫ్ పై.. ఆరుంధ‌తి.. మ‌గ‌ధీర‌.. ఈగ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు రాష్ట్రం పుట్టినిల్లుగా నిలిచింద‌న్నారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కు సంబంధించి ఎన్నో ఇంగ్లిష్ సినిమాల పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు హైద‌రాబాద్ లో జ‌రుగుతున్నాయ‌ని.. యానిమేష‌న్‌.. గేమింగ్ రంగంలో యువ‌త‌కు శిక్ష‌ణ క‌ల్పించేందుకు డిసెంబ‌రు 16న ఒక ప్ర‌ముఖ సంస్థ‌లో ఒప్పందం కుదుర్చుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు.


Tags:    

Similar News