కేసీఆర్ అశోక చక్రవర్తి.. చంద్రబాబు నీరో చక్రవర్తి: కేటీఆర్

Update: 2019-02-25 14:59 GMT
లోక్‌ సభ - ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రీల సీఎంలు - పాలక పార్టీల మధ్య ఏమాత్రం పొసిగే పరిస్థితి కనిపించడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రెండు రాష్ట్రాల పాలక పార్టీల నేతలు మరింత వేడి పుట్టిస్తున్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ తో టీడీపీ ఢీ అంటే ఢీ అంటూ తలపడడం.. ఆ తరువాత టీఆర్ ఎస్ ఘన విజయం సాధించడంతో రాజకీయంగా వేడి మొదలైంది. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని టీఆర్ ఎస్ ఇప్పటికే చెప్పింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ ఎస్ ముఖ్య నేతల నుంచి సాధారణ నేతల వరకు అంతా ఏపీ రాజకీయాలపై నిత్యం మాట్లాడుతూ చంద్రబాబును - టీడీపీని ఇరుకునపెడుతున్నారు. తాజాగా టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసీఆర్ - చంద్రబాబులను ఇద్దరు చక్రవర్తులతో పోల్చి సంచలనం రేపారు. కేసీఆర్ అశోక చకవర్తి అయితే చంద్రబాబు నీరో చక్రవర్తని కేటీఆర్ అన్నారు.
   
సోమవారం పాలమూరు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు కొందరు టీఆర్‌ ఎస్‌ లో చేరిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఒకరితో పొత్తులేకుండా చంద్రబాబు బతకలేరని విమర్శించారు. మామ ఎన్టీఆర్‌ దగ్గర నుంచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని - దుర్మార్గపు పాలన అంతంకావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్‌ అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడు సీట్లు కూడా రావని కేటీఆర్ జోస్యం చెప్పారు.
   
మోదీ - రాహుల్‌ మధ్యే పోటీ అంటూ... కాంగ్రెస్‌ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో బీజేపీ - కాంగ్రెస్‌ తప్ప వేరే పార్టీలు లేవా? అని ప్రశ్నించారు. మోదీ - రాహుల్‌ పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని అన్నారు. కేవలం ఇద్దరు ఎంపీలతో కేసీఆర్‌ తెలంగాణ తెచ్చారని కేటీఆర్ కొనియాడారు. 16 స్థానాల్లో టీఆర్‌ ఎస్‌ ను గెలిపిస్తే.. కేసీఆర్‌ ఢిల్లీని గడగడలాడించి రాష్ట్రానికి నిధులు తెస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు ఢిల్లీలో చేతులు కట్టుకొని నిలబడటం తప్ప చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీని ఎదిరించే దమ్ము - ధైర్యం కాంగ్రెస్‌ ఎంపీలకు లేదన్నారు. కాంగ్రెస్‌-టీడీపీది విచిత్ర కలయికని విమర్శించారు. రైతుబంధు పథకాన్ని ప్రధాని మోదీ కాపీ కొట్టారని కేటీఆర్‌ అన్నారు. మొత్తానికి ఎన్నికల వేళ అటు చంద్రబాబును - ఇటు మోదీని కూడా విమర్శిస్తూ టీఆర్ ఎస్ మళ్లీ ఓట్లు దండుకునే వ్యూహంలో ఉన్నట్లే అనిపిస్తోంది.


Tags:    

Similar News