వైసీపీలో ఫుల్ కన్ఫ్యూజన్...ధర్మాన దారి వేరు !
ఒక పార్టీగా వైసీపీ ఏపీ రాజధాని విషయంలో స్పష్టంగా ఉండలేకపోతోందా అన్న చర్చ సాగుతోంది. వైసీపీలో ఉన్న అన్ని ప్రాంతాల నాయకులు రాజధాని విషయం ఒకే మాట మీద ఉంటున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.;
ఒక పార్టీగా వైసీపీ ఏపీ రాజధాని విషయంలో స్పష్టంగా ఉండలేకపోతోందా అన్న చర్చ సాగుతోంది. వైసీపీలో ఉన్న అన్ని ప్రాంతాల నాయకులు రాజధాని విషయం ఒకే మాట మీద ఉంటున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధినాయకుడు వైఎస్ జగన్ ఈ నెల 1న ప్రెస్ మీట్ పెట్టి మరీ మావిగాన్ అని ఒక కొత్త ప్రతిపాదన చేశారు. దాని మీద వైసీపీలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయా అన్నదే ఇపుడు సందేహం కలుగుతోంది. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు వేరే తీరుగా ఉన్నాయేంటి అన్నది అంతా ఎత్తి చూపుతున్నారు.
మూడ్ మారింది కదా :
వైసీపీ అధికారంలో ఉన్నపుడు మూడు రాజధానులు అన్న నినాదం ఎత్తుకుంది. ఆ సమయంలో విశాఖలో పరిపాలనా రాజధాని పెడతామని చెప్పుకొచ్చింది. దాంతో ఉత్తరాంధ్రా వైసీపీ నాయకులు ఆ విషయం మీద గొప్పగా చెప్పుకునేవారు. వెనకబడిన ఉత్తరాంధ్రాకు రాజధానిని తీసుకుని వస్తున్నామని కూడా భారీ ప్రకటనలు ఇస్తూండేవారు. అయితే అయిదేళ్ళ వైసీపీ పాలనలో విశాఖలో జగన్ ఒక్క రోజు కూడా ఉండలేదు, ఇక పరిపాలనా రాజధాని అన్నది ఏమిటన్నది అందరికీ అర్ధమయ్యేలోగానే ప్రభుత్వం దిగిపోయింది. మూడు రాజధానులు కూడా అటకెక్కాయని లేటెస్ట్ గా జగన్ ఇచ్చిన మావిగాన్ స్టేట్ మెంట్ తో బోధపడింది అని అంటున్నారు.
ప్రాంతీయ ఉద్యమాలు అంటూ :
చంద్రబాబు అమరావతి పేరుతో అంతటా అభివృద్ధి ఒకే చోట పెడుతున్నారు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా విమర్శలు గుప్పించారు. అలా అయితే ఏపీలో ఇతర ప్రాంతాల అభివృద్ధి ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. వెనకబడిన ప్రాంతాల గురించి పట్టదా అని నిలదీశారు. అయితే జగన్ ప్రతిపాదించిన మావిగాన్ కూడా గుంటూరు విజయవాడల మధ్యనే ఉంది. అంటే అభివృద్ధి అంతా ఒకే చోట కుప్ప పోసినట్లుగా కేంద్రీకరిస్తున్నారు అని వైసీపీ నేతలు చెబుతున్న దానికి చేస్తున్న విమర్శలకు మావిగాన్ ప్రతిపాదన కూడా గురి అవుతున్నట్లే లెక్క.
విశాఖ ఏమైంది అంటూ :
అయితే దానికి ప్రత్యర్థుల నుంచి ధీటుగానే ప్రతి విమర్శలు వస్తున్నాయి. విశాఖ రాజధాని ఏమైందో చెప్పాలని వారు కౌంటర్లు వేస్తున్నారు. మావిగాన్ ప్రతిపాదన ధర్మానకు నచ్చిందా లేదా కూడా చెప్పాలని కోరుతున్నారు. మరో వైపు ఏపీకి రాజధాని ఎక్కడ అన్న దాని మీద కానీ అభివృద్ధి విషయంలో కానీ వైసీపీ నేతల మధ్య ప్రాంతాల మధ్య ఒక ఏకాభిప్రాయం లేదా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
వ్యతిరేకం కాదంటూనే :
ఇక బొత్స సత్యనారాయణ లాంటి ఉత్తరాంధ్రా నేతలు అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని అంటున్నారు. అదే సమయంలో మావిగాన్ ప్రతిపాదనలో తప్పేంటి అని సమర్థించుకుంటున్నారు. ఇక పక్క పక్క జిల్లాలలో ఉన్న బొత్స కానీ ధర్మాన కానీ ఉత్తరాంధ్రా అభివృద్ధి విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారా అన్న చర్చ కూడా వస్తోంది. అమరావతిని బొత్స ఓకే అంటూంటే ధర్మాన వేరే విధంగా మాట్లాడుతున్నారు. అధినాయకత్వం మావిగాన్ అంటోంది. మరి ఈ విధంగా తలో రకమైన అభిప్రాయాలను చెప్పడం వల్ల వైసీపీ తాను గందరగోళంలో చిక్కుకుని జనాలను పార్టీ జనాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది అని అంటున్నారు. ఇదే విధంగా ఉంటే వైసీపీకి రాజధాని ఇష్యూనే ఒక గుదిబండగా మారి రానున్న రోజులలో పొలిటికల్ గా బూమరాంగ్ అవుతుందని అంటున్నారు.