నై.. నై.. నాయకా.. వైసీపీలో గుబులు..!
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటమి పాలైన విషయం తెలిసిందే.;
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటమి పాలైన విషయం తెలిసిందే. వాస్తవానికి నియోజకవర్గంతో ఆయనకు సంబంధం లేదు. జిల్లాతో కూడా సంబంధం లేదు. ఎక్కడో చిత్తూరు నుంచి అందునా చంద్రగిరి నియోజకవర్గ నుంచి ఆయన ఒంగోలు కి వచ్చారు. పార్టీ అధినేత ఆదేశాలను తప్పకూడదన్న ఆశంతో ఇక్కడి నుంచి పోటీ చేశారు. కానీ స్థానికంగా బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ ఓటు బ్యాంకు కాపాడలేకపోయింది.
వైసీపీ నుంచి టీడీపీ లోకి వెళ్లిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి సునాయాసంగా విజయం దక్కించుకున్నారు. ఇక్కడ కావాల్సింది కేవలం సామాజిక వర్గాల స్థితిగతులే కాదు. ప్రజల నాడిని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయాలు.. ఓటు బ్యాంకు తీరు.. మారుతున్న పరిణామాలు.. ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంటే కచ్చితంగా గత ఎన్నికల్లో ఈ తప్పు జరిగి ఉండేది కాదని వైసీపీలోనే ఒక వర్గం అంచనా వేసింది.
నెల్లూరు సిటీ నుంచి ఎక్కడో ఉన్న గుంటూరు జిల్లాలోని నరసరావుపేటకు అనిల్ కుమార్ ని పంపించారు. ఇది కూడా సరైన నిర్ణయం కాదని అప్పట్లోనే చర్చ నడిచింది. అయినా తనను చూసి ఓటేస్తారనే వాదన కావచ్చు, లేదా భ్రమ కావచ్చు.. జగన్ ఈ తరహా మార్పులు చేశారు. మరి ఇప్పుడైనా వీటిని మార్చుకుంటున్నారా అంటే అంతగా స్పష్టత రావడం లేదు. అసలు వాస్తవానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బలమైన కూటమిని తట్టుకునే నిలబడగలిగే నాయకులు కూడా వైసీపీకి కనిపించడం తగ్గిపోయిందని చెప్పాలి.
రెండు రకాలుగా కూటమి వైపు నుంచి వైసీపీకి సవాళ్లు వస్తున్నాయి.
1) బలమైన నాయకులు.
2) రాజధాని సహా పెట్టుబడులు వంటి బలమైన వ్యూహాలు.
ఈ రెండు అంశాలు కూడా కూటమి వైపు అత్యంత ప్రభావం చూపించే అంశాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో వైసీపీకి అత్యంత మైనస్ గా కూడా మారుతున్నాయి. వీటిని తట్టుకొని నిలబడగలిగే నాయకులు వైసీపీలో వెతకాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. కొత్తగా తీసుకొచ్చి నాయకులను నిలబెడతామంటే 2019 మాదిరిగా ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు.
అసలు వచ్చేందుకు కూడా నాయకులు కనపడుతున్న పరిస్థితి లేదు. కాబట్టి విధానపరమైన నిర్ణయాల్లో పార్టీ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆశాకిరణం ఏంటంటే వచ్చే ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేస్తానని చెప్పటమే. ఈ పాదయాత్ర సక్సెస్ అయ్యే తీరును బట్టి వైసిపి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కానీ.. ఇది కూడా రాజధాని ఎఫెక్ట్‌తో ఏమేరకు సక్సెస్ అవుతుందన్నది అనుమానంగానే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.