హోదా మీద బాబుకు కేటీఆర్ సలహా

Update: 2016-07-20 16:37 GMT
అవకాశం వస్తే చాలు మంటపుట్టేలా విమర్శలు చేసే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తాజాగా సలహా ఇస్తూనే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎక్కడకొట్టాలో అక్కడ కొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. పలువురు మంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి గురించి సమావేశం అవుతూ బిజీబిజీగా ఉన్నారు.

మరోవైపు.. ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే ప్రైవేటు బిల్లులతో పనికాదని చెప్పిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా అయితే పలు పార్టీల్ని ఒప్పించారో.. అదే తీరులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రయత్నించాలని సూచన చేశారు. నిజానికి తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఆ పార్టీనే రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టి ఉండేదన్న మాట చెప్పిన కేటీఆర్.. ప్రైవేటు బిల్లుతో కాంగ్రెస్ సాధించేది ఏమీ ఉండదన్నారు. కేవీపీ తలకిందులు తపస్సు చేసినా.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బతికి బ్టటకట్టే అవకాశం లేదని చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టులను మహారాష్ట్రలోని ప్రాజెక్టులతో పోల్చి చూడటం కాంగ్రెస్ అవివేకమన్నారు. చూసేందుకు చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లుగా కనిపించినా.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి ఏం చేయలేదన్నవిషయాన్ని కేటీఆర్ తన మాటలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News