అరే.. ఈ ముచ్చట ఇన్నాళ్లకు తెలిసిందా కేటీఆర్

Update: 2021-12-09 07:42 GMT
ఇప్పటివరకు టీఆర్ఎస్ అధినేత కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కోపాన్ని మాత్రమే చూశాం. అప్పుడప్పుడు అనూహ్యంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ మంత్రి కేటీఆర్ తాజాగా విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో ఉద్యమకారులు బీజేపీలో భాగస్వామ్యం కావటంపై ఆయన విరుచుకుపడ్డారు.

ఢిల్లీలో ఒకరి తర్వాత ఒకరు బీజేపీలో చేరుతున్న వేళ.. తమ పార్టీ సైతం వీక్ కాలేదన్న సంకేతాల్ని ఇచ్చేలా.. తమ పార్టీలోకి పలువురు చేరుతున్నారన్న సందేశాన్ని ఇచ్చేందుకు వీలుగా తాజాగా పార్టీ కార్యాలయంలో ఒక ప్రోగ్రాం జరిగింది. అందులో.. కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చల్మెడ లక్ష్మీనరసింహారావు తాజాగా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.

అవకాశం లభించిందే తడవు అన్నట్లుగా బిజేపీ నేతల మీద తనకున్న ఆగ్రహాన్ని నోటి మాటలతో ప్రదర్శించారు. గడిచిన ఏడున్నరేళ్లుగా కేంద్రంలో అధికారాన్నిచెలాయిస్తున్న మోడీ మీద అప్పుడప్పుడు మాట్లాడినా.. అది కూడా అంత ఆవేశం లేని రీతిలో మాట్లాడే కేటీఆర్.. తాజాగా ఆయన స్వస్థలమైన గుజరాత్ గుర్తుకు రావటమే కాదు.. ఢిల్లీ బానిసలం కాదంటూ రైమింగ్ మాటల్ని చెప్పేశారు. గుజరాత్ కు గులాములు కాదు.. ఢిల్లీకి బానిసలం కాదన్న ఆయన.. బీజేపీ నేతలకు విషయం తెలీదు.. విషం చిమ్మటమే తెలుసంటూ మాటల మేజిక్ ను ప్రదర్శించారు.

తెలంగాణ ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటీ చేయరన్న ఆయన.. తెలంగాణ రైతులను రోడ్ల మీదకు గుంజి యుద్ధం చేయాలనే ఆలోచనే తప్పించి.. సమస్యకు పరిష్కారం చూపే సోయి లేదన్నారు. ఏమైనా అంటే ఐటీ.. ఈడీ.. జైల్లో వేస్తామని చెబుతున్నారని.. వారి ఉడత ఊపులకు భయపడమన్నారు.

‘‘గుజరాత్‌కు గులాములం కాదు.. ఢిల్లీకి బానిసలం అంతకంటే కాదు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం. తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై గొంతువిప్పి ఎందాకైనా కొట్లాడతాం’’ అంటూ మండిపడ్డ మంత్రి కేటీఆర్.. మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఉద్యమ కారులు బీజేపీలోకి రావాలని బీజేపీ నేత ఒకరు పిలుస్తున్నారని.. అసలు వారు మీ పార్టీలోకి ఎందుకు రావాలి? ఏం పీకారని? అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు. ఆంధ్రాలో ఏడు మండలాల్ని విలీనం చేసినందుకా? నీతి ఆయోగ్ సిఫారుసు చేసినా మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథకు రూ.24వేల కోట్లు ఇవ్వనందుకా? పునర్విభజన చట్టంలోని హామీల్ని నెరవేర్చనందుకా? అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

‘బీజేపీ ఎంపీలు చిల్లరగాళ్లలా తయారయ్యారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణకు సంబంధించిన అంశాలపై పేగులు తెగేలా కొట్లాడుతున్నది గులాబీ జెండా మాత్రమే. మాకు బాస్‌లు గుజరాత్, ఢిల్లీలో లేరు. మేము తెలంగాణ గల్లీల్లోని ప్రజలకు మా త్రమే జవాబుదారీ’ అంటూ తెలంగాణ ఓనర్ షిప్ తమది మాత్రమే అన్న విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.

ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ కేటీఆర్.. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన వారికి.. తెలంగాణ ఉద్యమ వేళ ప్రాణాలు అర్పించిన వారికి కనీసం నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు.. ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వనట్లు? ఇప్పుడు గుజరాత్ గుర్తుకొచ్చి ఆగ్రహావేశాలతో వ్యాఖ్యలు చేస్తున్నారు సరే.. మోడీ జమానా మొదలై ఏడున్నరేళ్ల తర్వాత.. ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించే రాష్ట్రం గుర్తుకు రావటం ఏమిటి? సెంటిమెంట్ ను తట్టి లేపేందుకు రైమింగ్ మాటలు బాగానే ఉన్నా.. అలాంటి వాటికి స్పందించేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా లేరన్న ప్రాథమిక విషయాన్ని కేటీఆర్ ఎప్పటికి గుర్తు చేసుకుంటారో?


Tags:    

Similar News