సోము మాటకు కస్సుమన్న కేటీఆర్.. ఆ విషయంపై మౌనమేల?

Update: 2021-12-29 15:31 GMT
కావాలన్నప్పుడు కౌగిలించుకోవటం.. వద్దనుకున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టటం.. టార్గెట్ చేస్తే.. అదే పనిగా వెంటాడటం లాంటివి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లో ఎక్కువ అవుతున్నాయా? పరాయి రాష్ట్రంలో మాకు పనేంటి? అని మాట్లాడే ఆయన.. అందుకు భిన్నంగా సంబంధం లేని విషయాలకు రియాక్టు అవుతున్న తీరు ఆయనపై విమర్శల వర్షం కురిపించేలా చేస్తోంది. గతంలో కేటీఆర్ మాట్లాడితే అంతో ఇంతో అర్థం ఉంది.. మరీ అడ్డ బ్యాటింగ్ తరహాను ప్రదర్శించరన్న పేరుండేది. అందుకు భిన్నంగా ఆయన మాటలుఉంటున్నాయి. ఈ కారణంతోనే ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు భిన్నంగా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పంచ్ లు పడుతున్నాయి.

తమకు ఓట్లు వేసి గెలిపిస్తే.. చౌక ధరలకు లిక్కర్ అందిస్తామని చెప్పటమే కాదు.. క్వార్టర్ బాటిల్ ను రూ.75కు.. కుదిరితే రూ.50కు అయినా అందించే ప్రయత్నం చేస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. ఈ వ్యాఖ్యపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. సోముపై ఘాటు ట్వీట్ పంచ్ వేయటమే కాదు.. ఇది బీజేపీ జాతీయ విధానమా? లేదంటే ఆ పార్టీ బలహీనంగా ఉండే రాష్ట్రాల్లో అమలు చేసే విధానమా? అంటూ పంచ్ విసిరారు.

ఏపీ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలకు ఇంతలా స్పందించే కేటీఆర్.. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఎందుకు రియాక్టు కావటం లేదు? తమకు రాజకీయ వైరం ఉంటే చాలు.. ఏమైనా అనేస్తామన్నట్లుగా ఉండే కేటీఆర్ మీద పంచ్ లు పేలుతున్నాయి. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినంతనే ఇష్టారాజ్యంగా మద్యం ధరల్ని పెంచినప్పుడు కానీ.. దేశంలో మరెక్కడా లేని బ్రాండ్లు ఏపీలో అమ్మేస్తూ.. వాటి నాణ్యతపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పుడు సైతం స్పందించని కేటీఆర్.. అందుకు భిన్నంగా తక్కువ ధరకు లిక్కర్ సరఫరా చేస్తామని సోము చెబితే.. అదో పెద్ద తప్పన్నట్లుగా మండి పడటంలో అర్థమేమిటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో మద్య నిషేధం అమలు చేస్తుంటే.. సోము వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపాటులో అర్థం ఉంది. ఒకపక్క దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంటే.. అందుకు  భిన్నంగా తెలంగాణలో మాత్రం డిసెంబరు 31 రాత్రి పన్నెండు గంటల వరకు మద్యం దుకాణాల్ని తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ''వాట్ ఏ స్కీం.. వాట్ ఏ షేమ్'' అనేస్తూ ట్వీట్ పంచ్ వేసిన మంత్రి కేటీఆర్.. మద్యం అమ్మకాల్ని పెంచుకోవటానికి తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఏమీ భిన్నంగా లేదనే విషయాన్ని ఆయన ఎలా మార్చిపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.

 క్లబ్బులు.. పబ్ లకు అదనపు గంటలు పని చేసేలా వెసులుబాటు ఇవ్వటం లాంటివి చూసినప్పుడు... మద్యం ఏరులై పారేలా కేసీఆర్ ప్రభుత్వ విధానం ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.తమపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వలేని కేటీఆర్.. తక్కువ ధరకే లిక్కర్ అందిస్తామని పక్క రాష్ట్రానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నంతనే భరించలేనంత బూతు విన్నట్లుగా కేటీఆర్ రియాక్టు కావటంలో అర్థం లేదన్న వాదన వినిపిస్తోంది.

మరోవైపు.. సినిమా టికెట్ ధరల్ని పెంచిన తెలంగాణ ప్రభుత్వానికి భిన్నంగా కప్పు టీ కంటే తక్కువ ధరకు సినిమా టికెట్లను డిసైడ్ చేసిన ఏపీ ప్రభుత్వం తీరును కేటీఆర్ ఎందుకు ప్రశ్నించటం లేదు. చౌక ధరకు మద్యాన్ని సరఫరా చేస్తామని సోము అన్నంతనే.. వాట్ ఏ స్కీం.. వాట్ ఏ షేమ్ అనేసిన ఆయన.. ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో సినిమా టికెట్ ధరను రూ.5 డిసైడ్ చేసిన వైనంపై ఇదే రీతిలో ఎందుకు రియాక్టు కావట్లేదు?

ఒక రైతు తాను పండించే పంటకు ధరను డిసైడ్ చేసుకోకపోవటాన్ని ప్రశ్నించే వేళ.. ఒక సినిమాను తీసుకున్న నిర్మాత.. తనకు తోచినంత ధర ఎందుకు ఫిక్స్ చేసుకోకూడదన్నది ప్రశ్న. ఒకవేళ నిర్మాత తనకు నచ్చిన ధరను నిర్ణయించుకున్నంత మాత్రాన ప్రేక్షకులు పోలోమంటూ థియేటర్లకు పోటెత్తరు కదా? తేడా వస్తే.. పిట్ట కూడా కనిపించదు. ఇంతటి రిస్కు ఉన్నప్పుడు ఏ నిర్మాత తొండి గేమ్ ఆడడు. ఆడితే మొదటికే మోసం వస్తుంది. అయినప్పటికీ.. సినీ పరిశ్రమను టార్గెట్ చేసినట్లుగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందన్న మాట వినిపిస్తున్న వేళ.. తక్కువ ధరకు లిక్కర్ ఇస్తామంటే తప్పుగా అనిపించిన కేటీఆర్ కు.. కారుచౌకగా సినిమా టికెట్ ను డిసైడ్ చేసిన తీరును ఎందుకు ట్వీట్ తో ప్రశ్నించరు? అని కేటీఆర్ ను క్వశ్చన్ చేస్తున్నారు. వాట్ ఏ షేమ్ మాట అనే ముందు.. తన మాటకు అలాంటి వ్యాఖ్య వినిపిస్తుందన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు మిస్ అవుతున్నారు?
Tags:    

Similar News