కేటీఆర్‌ కు ఆంధ్రపై మోజు పెరిగిపోతోంది

Update: 2018-04-10 08:32 GMT
ఆంధ్ర ప్రాంతంతో మేం కలిసుండం అంటూ విడిపోయిన తెలంగాణ రాష్ర్టంలోని మంత్రి కేటీఆర్ ఎందుకనో ఆంధ్ర అంటే మోజు పెరిగిపోతోంది. ఇప్పటికే భీమవరం - కోడి పందేలు మొదలైన అంశాల్లో ఎన్నోసార్లు ఆంధ్రప్రాంతంపై కేటీఆర్ మక్కువ చూపడం.. అలాగే భీమవరం ప్రాంతంలో కేటీఆర్ తండ్రి కేసీఆర్ చిత్రాలతో అక్కడివారు ఫ్లెక్సీలు పెట్టడం గతంలో జరిగింది. తాజాగా కేటీఆర్ మరోసారి ఏపీపై ఆసక్తి చూపారు. పైగా అది ఏపీలో టీఆరెస్ శాఖ ఏర్పాటు గురించి కావడంతో హాట్ టాపిగ్గా మారింది.
    
ఖమ్మం జిల్లా మధిరలో మాట్లాడిన ఆయన ఏపీలోనూ టీఆర్‌ ఎస్ శాఖ పెట్టాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.  దేశం అబ్బురపడేలా తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని, తాము 42 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని, ఇంటింటికి తాగునీరు అందించాలన్న ఉద్దేశంతోనే మిషన్ భగీరథ పథకం చేపట్టామని చెబుతూ ప్రభుత్వ కార్యక్రమాలను వల్లెవేశారు.
    
అయితే... కేటీఆర్ పదేపదే ఇలా ఏపీలో పోటీ చేయడం గురించి మాట్లాడుతుండడంతో నిజంగానే టీఆరెస్ అలాంటి ఆలోచనలో ఉందా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల దిశగా ఆలోచిస్తున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రంలోనూ పార్టీ ఉంటే జాతీయ స్థాయిలో కేసీఆర్ వెళ్లినప్పుడు రెండు రాష్ట్రాలకు చెందిన పార్టీగా టీఆరెస్ కు దాని అధినేతగా కేసీఆర్ కు మరింత గుర్తింపు వస్తుందన్న కోణంలో ఆ పార్టీ ఈ దిశగా ఆలోచిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News