అబ్బాయిగారికి ఇప్పట్లో సీఎం కావాలని లేదట

Update: 2016-05-10 17:17 GMT
తెలివిగా వ్యవహరించటం.. ప్రత్యర్థులకు.. విమర్శకులకు ఏ మాత్రం దొరక్కుండా మాట్లాడటంతో కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం దొరక్కుండా మాట్లాడే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో తాజాగా.. మంత్రి కేటీఆర్ మాట్లాడారు.  ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల్ని ప్రస్తావించిన కేటీఆర్.. వారసత్వ రాజకీయాలంటే తనకు చిరాకని చెప్పుకొచ్చారు.

ఇక.. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని.. తన తండ్రి కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని తాను అనుకుంటున్నట్లుగా వెల్లడించారు. టీఆర్ఎస్ బలపడే క్రమంలో పార్టీలోకి తాజాగా పలువురు నేతల్ని పార్టీలోకి చేర్చుకుంటున్న వైనాన్ని కేటీఆర్ ను ప్రశ్నించినప్పుడు.. పార్టీలోకి వచ్చి చేరుతున్న నేతల తీరు కొందరి నచ్చొచ్చని.. కొందరికి నచ్చకపోవచ్చని.. అదంతా వారి ఆలోచనను అనుసరించి ఉంటుందన్న మాటను చెప్పారు.

అవసరం కోసం పార్టీలోకి వచ్చిన వారంతా పర్మినెంట్ కాదు కదా అన్న ప్రశ్నను మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు కాస్తంత భావోద్వేగంతో స్పందిస్తూ.. జీవితమే తాత్కాలికమని.. ఏదీ పర్మినెంట్ కాదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. శాఖల మార్పు అన్నది ముఖ్యమంత్రి ఆలోచనకు తగ్గట్లుగా జరిగిన మార్పు అని.. తనకు ఏ శాఖను ఇచ్చిన పని చేస్తానంటూ చాలానే కబుర్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు తమ పార్టీకి చెందిన నేతలు అవినీతికి పాల్పడినా వేటు వేయటం తప్పనిసరి అన్న విషయాన్ని చెప్పటం గమనార్హం. కేటీఆర్ మాటలు ఓకే కానీ.. చేతల్లో కూడా అంతే పక్కాగా ఉంటారా? అన్నదే ఇప్పుడు అందరిని వేధించే ప్రశ్నగా చెప్పొచ్చు.
Tags:    

Similar News