'పెళ్లికి ఓకే చెప్పి ప్రేమ షురూ చేసి.. తర్వాత నో చెబితే మోసం కాదు'
ప్రేమ.. పెళ్లి.. ప్రేమవిఫలం.. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకోవటం లాంటి అంశాలతో కలిసిన ఒక ఉదంతానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.;
ప్రేమ.. పెళ్లి.. ప్రేమవిఫలం.. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకోవటం లాంటి అంశాలతో కలిసిన ఒక ఉదంతానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ప్రేమలో కొనసాగి తర్వాతి పెళ్లి చేసుకోనంత మాత్రాన అది మోసం కిందకు రాదని స్పష్టం చేసింది. మోసం చేయాలన్న ఉద్దేశంతోనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమను ప్రారంభించినట్లుగా ఆధారాలు ఉంటే దాన్ని మోసం కిందకు పరిగణించొచ్చన్న విషయాన్ని తన తీర్పులో భాగంగా వెల్లడించింది తెలంగాణ అత్యుత్తమ న్యాయస్థానం.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాలకు చెందిన కె.సంతోష్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.తుకారాంజీ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది.. ఎలాంటి ఆధారాల్లేకుండా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. వ్యక్తిగత సంబంధాలు దెబ్బ తింటే అవి నేరం కిందకు రావన్న విషయాన్ని గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. దీనికి ప్రతిగా యువతి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
2018లో ప్రేమను ప్రతిపాదించిన సమయంలో సదరు యువతి నో చెప్పారని.. అయితే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఒప్పించాడన్నారు. ఐదేళ్లపాటు అనుబంధాన్ని సాగించిన తర్వాత ఇప్పుడు పెళ్లికి నో చెప్పిన వైనాన్ని పేర్కొంటూ.. ఈ విషయాన్ని పెద్దల వద్ద మధ్యవర్తిత్వానికి వెళ్లగా తొలుత పెళ్లికి ఓకే చెప్పి తర్వాత పరిహారం ఇస్తానని చెప్పటాన్ని ప్రస్తావించారు. ఇదంతా మోసంగా పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన తీర్పును వెల్లడిస్తూ.. కీలక అంశాల్ని ప్రస్తావించారు. అనంతరంపిటిషనర్ పై నమోదు చేసిన కేసును కొనసాగించటం చట్ట ప్రక్రియను దుర్వనియోగం చేయటమే అవుతుంది. హైకోర్టు విచక్షణాధికారాన్ని వినియోగించి పిటిషనర్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక.. ఈ తీర్పునకు దారి తీసిన పలు అంశాల్ని ప్రస్తావించారు. అందులోని ముఖ్యమైన అంశాల్లోకి వెళితే..
- ప్రేమ ఆరంభంలో మోసం చేయాలన్న దురుద్దేశం లేకపోతే మోసంగా పేర్కొనలేమని గతంలో ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. వీటికి నిదర్శనంగా హ్రదయ్ రంజన్ ప్రసాద్ వర్మ వర్సెస్ బిహార్, ప్రమోద్ సూర్యభాన్ పవార్ వర్సెస్ మహారాష్ట్ర తదితర కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చింది.
- మోసం చేయాలన్న ఉద్దేశం లేనప్పుడు కేవలం పెళ్లి చేసుకుంటానన్న వాగ్దానం మాత్రమే చేసినట్లు. ఇది వాగ్దాన ఉల్లంఘనే తప్పించి మోసంగా పరగణించలేం.
- ప్రస్తుత కేసులో ఐదేళ్లు ప్రేమలో కొనసాగారు. ఇది వాగ్దానంలో వైఫల్యమే తప్పించి మోసం కాదు. సుదీర్ఘ కాలం ప్రేమలో కొనసాగిన పిటిషనర్ కు ప్రారంభంలో మోసపూరిత ఉద్దేశం ఉందనటానికి ఎలాంటి ఆధారాలు లేవు.