టీడీపీ అంచ‌నా: అన్న‌దాత హ్యాపీసేనా.. ?!

దీనికి నాడు అనుసరించిన రైతు విధానాలు, రైతు భరోసా కేంద్రాల వంటి క్షేత్రస్థాయిలో తీసుకున్న సంస్కరణలు ఫలించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.;

Update: 2026-04-04 04:13 GMT

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో అత్యంత కీలకమైనది వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఓటు బ్యాంకు గా మారే సంక్షేమ పథకం అన్నదాత సుఖీభవ. క్షేత్రస్థాయిలో ఎంత అభివృద్ధి చేసినప్పటికీ దానివల్ల వచ్చే ఓటు బ్యాంకు కంటే కూడా రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటే వచ్చే ఓటు బ్యాంకు భిన్నంగా ఉంటుంది. ఈ విషయం గత ఎన్నికల్లోనే స్పష్టమైంది. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి తుడిచిపెట్టుకుపోయినప్పటికీ, కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయినప్పటికీ గ్రామీణ ఓటు బ్యాంకు మాత్రం పదిలంగా కాపాడుకోగలిగింది.

దీనికి నాడు అనుసరించిన రైతు విధానాలు, రైతు భరోసా కేంద్రాల వంటి క్షేత్రస్థాయిలో తీసుకున్న సంస్కరణలు ఫలించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా గ్రామీణ ఓటు బ్యాంకు మరింతగా పెరుగుతున్న క్రమంలో రైతును సంతోష పెట్టడం అనేది ప్రభుత్వాలకు ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. ఒకవైపు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. ప్రకృతి పరంగా జరుగుతున్న తుఫానులు, వరదలు వంటి కారణంతో రైతులు నష్టపోతున్నారు. వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం కొంత ఉదాసీనంగా ఉందన్న విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అదే విధంగా పంటలకు కనీస మద్దతు ధరలు ఇప్పించడంలోనూ ప్రభుత్వం కొంత వెనుకబడిందని సమాచారం. దీనిపై పలు సందర్భాల్లో సమీక్షలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దాలని మంత్రుల కమిటీని కూడా వేశారు. మంత్రుల కమిటీ దీనిపై పలు సందర్భాల్లో చర్చలు జరిపింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఈ విషయం ఎవరు పట్టించుకోలేదు. ముఖ్యంగా మూడు అంశాలపై రైతులు ఆవేదనతో ఉన్నారన్నది ప్రభుత్వానికి తెలిసింది.

1) పంటలకు మద్దతు ధర లేకపోవడం. పలు జిల్లాల్లో పండిన పంటలు నష్టపోతుండడం.

2) అన్నదాత సుఖీభవ పథకం కొంతమందికి మాత్రమే అమలు అవుతుండడం. దీనిపై సమీక్షలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం.

3) వరదలు, తుఫాన్లు వంటివి వచ్చినప్పుడు పంట నష్టం పై అంచనాలను వేస్తున్నామని హడావిడి చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు తగిన విధంగా న్యాయం జరగడం లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ.

వీటిని ప్రత్యర్థులు రెచ్చగొట్టారని, లేకపోతే వైసిపి నాయకులు యాగి చేస్తున్నారనే కోణంలో ప్రభుత్వం కనుక చూస్తే అది వ్యతిరేకతకు దారితీస్తుంది. రైతుల ఆగ్రహానికి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తే తప్ప గ్రామీణ ఓటు బ్యాంకు పై కూటమి ప్రభుత్వం ప్రభావం ఆశించిన విధంగా కనిపించదు అన్నది ప్రస్తుతం వస్తున్న అంచనా. మరి ప్రభుత్వం ఏం చేస్తుందనేది చూడాలి.

Tags:    

Similar News