ఆ పని చేయలేనంటున్న కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇటీవల తనపై జోరుగా సాగుతున్న ప్రచారానికి క్లారిటీ ఇచ్చారు. ఐటీ - పరిశ్రమలు - పురపాలక - ఎన్నారై - గనులు - చేనేత వ్యవహారాల శాఖ..ఇలా కీలక శాఖలకు బాధ్యుడిగా ఉన్న కేటీఆర్ ఇటీవల పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ భవిష్యత్ రాజకీయంపై కొత్త రాజకీయ మొదలైంది. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి కేటీఆర్ గుడ్ బై చెప్పనున్నారనేది ఇందులో కీలక అంశం.
రాబోయే కాలంలో ఆయన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకుంటారని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీనికి తాజాగా కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. సిరిసిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్ తన నియోజకవర్గమైన సిరిసిల్ల అభివృద్ధిపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ తన ఇలాకా మార్పుపై స్పష్టత ఇచ్చారు. కేటీఆర్ సిరిసిల్లను విడిచి వెళ్లడం జరగదని తెలిపారు. రాజకీయ జీవితం ఉన్నంతవరకూ ఇక్కడ ప్రజలతోనే ఉంటానని, సిరిసిల్ల నేతన్నలను తాను వదిలి వెళ్లలేనని చెప్పారు.
సిరిసిల్ల నేతన్నలు ఆత్మగౌరవంతో బతికేలా చూస్తామని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటికే రూ.200 కోట్ల ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. చేనేత, జౌళి శాఖకు బడ్జెట్ లో రూ.1200 కోట్లు కేటాయించినట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.1500, రూ.1000 చొప్పున పింఛన్లు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదన్నారు. పింఛన్ల కోసం ఏటా రూ.5300 కోట్లు వెచ్చిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.సిరిసిల్లను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతానన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సిరిసిల్లలో వచ్చే రెండేళ్లలో పూర్తిగా సీసీ రోడ్లు వేయిస్తామని కేటీఆర్ ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/