అమెరికా సైనిక కదలికలపై.. ఆ దేశం నిఘా.. ఇరాన్ కు చేరవేసేది ఆ దేశమేనా?
చైనా ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి నిఘా టూల్స్‌ను బహిరంగంగా మార్కెటింగ్ చేయడంపై వాషింగ్టన్ స్పందించింది.;
ఒకవైపు ప్రపంచ దేశాల ముందు శాంతిని బోధిస్తున్నట్లు కనిపిస్తున్నా, మరోవైపు చైనా తన ఏఐ (AI), సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అమెరికా సైన్యంపై నిఘా పెట్టడం అంతర్జాతీయ భద్రతకు కొత్త సవాలుగా మారింది. ఏప్రిల్, 2026 నాటి తాజా నివేదికల ప్రకారం, పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ) తీవ్రతరమైన వేళ, చైనా టెక్ కంపెనీలు అమెరికా సైనిక కదలికలను ఖచ్చితత్వంతో ట్రాక్ చేస్తున్నాయి.
బహిరంగ సమాచారమే ఆయుధం
చైనా కంపెనీలు ఎటువంటి రహస్య గూఢచారి వ్యవస్థలను కాకుండా, అందుబాటులోని సమాచారాన్నే ఏఐ ద్వారా విశ్లేషిస్తున్నాయి. ఉపగ్రహ చిత్రాలు, ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా రవాణా సమాచారాన్ని కృత్రిమ మేధస్సుతో అనుసంధానం చేస్తున్నారు. చైనాకు చెందిన ‘జిలిన్’ శాటిలైట్ కన్సల్టేషన్ నుంచి భారీగా చిత్రాలను కొనుగోలు చేస్తూ, అమెరికా విమానవాహక నౌకలు, యుద్ధ విమానాలు ఉండే స్థానాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నవారు. వాటి గమన తీరును సున్నితంగా పర్యవేక్షిస్తున్నారు. ఏఐ కళ్ల ముందు అదృశ్య విమానాలకు కూడా చోటు లేదు’ అని చైనా కంపెనీలు పేర్కొనడం గమనార్హం. అమెరికాకు చెందిన బీ-2 స్టీల్త్ బాంబర్ల మధ్య జరిగిన కమ్యూనికేషన్ కూడా పసిగట్టామని వారు చెప్తుండడం అమెరికాకు కలవరం కలిగిస్తోంది.
ఇరాన్ కు రహస్య సాయం
బహిరంగంగా తటస్థంగా ఉంటున్నట్లు నటిస్తున్నా, చైనా తన మిత్రదేశమైన ఇరాన్ కు కీలక సమాచారాన్ని చేరవేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధాల మోహరింపు గురించి చైనా కంపెనీలు సేకరించిన సమాచారం ఇరాన్ తన రక్షణను పటిష్టం చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. కేవలం సమాచారమే కాకుండా, మిస్సైల్ విడిభాగాలు, చిప్ మేకింగ్ టూల్స్, రాకెట్ ఇంధనానికి ఉపయోగించే 'సోడియం పర్క్లోరేట్'ను కూడా చైనా ఇరాన్ కు సరఫరా చేస్తున్నట్లు అంతర్జాతీయ సమాజం ఎదుట గుసగుసలాడుతుంది.
ముప్పు ముంగిట ప్రపంచం!
చైనా ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి నిఘా టూల్స్‌ను బహిరంగంగా మార్కెటింగ్ చేయడంపై వాషింగ్టన్ స్పందించింది. చైనాలోని ప్రైవేట్ కంపెనీలు ఆ దేశ సైన్యంతో లోతైన సంబంధాలు కలిగి ఉండటమే ఈ ముప్పునకు కారణం. ఒకప్పుడు ప్రభుత్వాలకు మాత్రమే సాధ్యమైన ఈ స్థాయి నిఘా, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల భవిష్యత్తులో సైనిక కార్యకలాపాలను రహస్యంగా ఉంచడం అసాధ్యంగా మారనుంది.
గూఢచర్యానికి కొత్త చిరునామా!
గతంలో ఒక దేశపు సైనిక కదలికలను తెలుసుకోవాలంటే గూఢచారులు లేదంటే అత్యంత ఖరీదైన సైనిక ఉపగ్రహాలు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు ఫ్లైట్ రాడార్ వంటి పబ్లిక్ యాప్స్, వాణిజ్య ఉపగ్రహాల డేటాను ఏఐ ద్వారా విశ్లేషిస్తున్నాయి. దీనివల్ల అమెరికాకు చెందిన అత్యంత రహస్యమైన ‘స్టీల్త్’ యుద్ధ విమానాలు ఎక్కడ ఉన్నాయి.., విమానవాహక నౌకలు ఏ దిశలో కదులుతున్నాయి.., అనే సమాచారం చిటికెలో చైనా సైన్యానికి చేరుతోంది. ప్రైవేట్ రంగంలో జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యం పెరగడం వల్ల భవిష్యత్తులో ఏ దేశమూ తన సైనిక వ్యూహాలను పూర్తిగా రహస్యంగా ఉంచడం అసాధ్యంగా మారనుంది.
ప్రపంచ దేశాలకు హెచ్చరిక
ఈ ఏఐ నిఘా టూల్స్‌ను చైనా కంపెనీలు బహిరంగంగా మార్కెటింగ్ చేయడం వల్ల కేవలం అమెరికాకే కాకుండా, భారత్ వంటి ఇతర దేశాలకు ముప్పు పొంచి ఉంది. ఏఐ రాకతో ఒకప్పుడు కేవలం ప్రభుత్వాలకే పరిమితమైన నిఘా సామర్థ్యం ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఉగ్రవాద సంస్థలు లేదంటే శత్రు దేశాల చేతుల్లోకి వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు ఇలాంటి సాంకేతిక సాయం అందడం వల్ల యుద్ధ గమనం మారే అవకాశం ఉందని, ఈ డిజిటల్ యుద్ధ తంత్రాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కొత్త రక్షణ కవచాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, డేటా మరియు ఏఐ ల్యాబ్స్‌లో కూడా జరుగుతోంది. చైనా చేస్తున్న ఈ ఏఐ నిఘా వల్ల అమెరికా తన సైనిక వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓపెన్ సోర్స్ సమాచారాన్ని ఏఐ ఎంత శక్తివంతమైన ఆయుధంగా మార్చగలదో ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇది కేవలం అమెరికాకే కాదు, రేపు భారత్ వంటి ఇతర దేశాల భద్రతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.