కారు-కమలం కలిసిన వేళ!
తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోనూ కారు-కమలం కలిసి పదవులు పంచుకున్నాయి. ఖానాపూర్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన అంకం మౌనిక చైర్ పర్సన్ పోస్టును దక్కించుకున్నారు.;
కారు.. బీఆర్ ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు. కమల.. బీజేపీ ఎన్నికల గుర్తు. ఈ రెండు పార్టీలు కూడా.. ఉప్పు నిప్పు మాదిరిగా రాజకీయాలు చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ.. అంతర్గతంగా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అనుకూలంగా రాజకీయాలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో కొన్ని కొన్ని మునిసిపాలిటీలలో చైర్మన్ గిరీని కలిసి దక్కించుకున్నాయి.
అయితే.. అప్పట్లో ఈ విషయం తమకు తెలియదని.. క్షేత్రస్థాయి నాయకత్వం తీసుకున్న నిర్ణయమని.. దీనిని సమీక్షించి.. మందలిస్తామని బీఆర్ ఎస్ ప్రకటించింది. కానీ, బీజేపీ మాత్రం సైలెంట్ అయిపో యింది. పోనీ.. బీఆర్ ఎస్ అయినా.. దీనిపై నిర్ణయం తీసుకుందా? అంటే.. అది కూడా లేదు. ఆ తర్వాత.. మౌనంగానే ఉండిపోయింది. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్‌కు ఎదురు దెబ్బలు తగులుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని మాత్రం చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోనూ కారు-కమలం కలిసి పదవులు పంచుకున్నాయి. ఖానాపూర్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన అంకం మౌనిక చైర్ పర్సన్ పోస్టును దక్కించుకున్నారు. అయితే.. ఆమె ఒంటరిగా ఈ పదవిని దక్కించుకోలేదు. బీజేపీ నాయకుల సపోర్టుతో గెలుపు గుర్రం ఎక్కి చైర్ పర్సన్ పోస్టును దక్కించుకున్నారు. ఇక, బీఆర్ ఎస్ పార్టీకి చెందిన సోయెల్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
అయితే.. ఈయన కూడా బీజేపీ సహకారంతోనే ఈ సీటును దక్కించుకున్నారు. మరి క్షేత్రస్థాయిలో కారు - కమలం కలిసి సాగుతున్నదన్న వాదనకు ఈ వ్యవహారం అద్దం పడుతోంది. అయితే.. చిత్రం ఏంటంటే.. కొన్ని చోట్ల కాంగ్రెస్-బీజేపీ కూడా కలిసి పదవులు పంచుకోవడంతో మూడు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఈ విషయంలో విమర్శలు చేసుకోకపోవడం గమనార్హం.