విజయ్ లో ఆధ్యాత్మిక కోణం.. ... మొక్కులు చెల్లించిన వైనం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నెల రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. గత నెల 10న ఆయన సీఎం గా ప్రమాణం చేసిన సంగతి విధితమే.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నెల రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. గత నెల 10న ఆయన సీఎం గా ప్రమాణం చేసిన సంగతి విధితమే. ఈ నెల రోజులలో ఆయన ఢిల్లీకి రెండు సార్లు వెళ్లారు. గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలసి వచ్చారు. తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్ళిన ఆయన నీతి అయోగ్ సమావేశంలో పాలు పంచుకున్నారు. ఇక ఇపుడు ఆయన తొలిసారి తమిళనాడు దాటి కర్ణాటకకు రావడం విశేషం. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక పర్యటన కావడంతో మరింతంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
అమ్మ వారి సేవలో :
విజయ్ తొలిసారి కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కొల్లూరు మూకాంబిక అమ్మ వారి ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక తన మొక్కులను కూడా చెల్లించుకున్నారు. 1.6 కిలోల బరువు ఉన్న వెండి ఖడ్గాన్ని ఆయన అమ్మ వారికి కానుకగా సమర్పించడం విశేషం. నీతి అయోగ్ కి ఢిల్లీ వెళ్ళిన విజయ్ అక్కడ నుంచి నేరుగా మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 125 కిలోమీటర్లు ప్రయాణించి మూకాంబిక అమ్మ వారి ఆలయానికి చేరుకోవడం జరిగింది. సంప్రదాయ వస్త్రధారణతో విజయ్ అమ్మ సేవలో పాలు పంచుకోవడం విశేషం. అంతే కాదు ఆయన గర్భ గుడిలో దాదాపుగా అరగంట పాటు గడిపారు.
గతంలో సీఎంలుగా :
ఇక మూకాంబికా అమ్మ వారిని గతంలో తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంజీఆర్, అలాగే ఆయన సతీమణి జానకీ రామచంద్రన్, జయలలిత కూడా కొలిచి మొక్కులు తీర్చుకున్నారు. ఇపుడు విజయ్ కూడా వారి బాటలోనే మొక్కులు చెల్లించుకోవడం అమ్మను దర్శించడం విశేషంగా భావిస్తున్నారు.ఎంజీఅర్ జయలలితలకు ఇది సెంటిమెంట్ గా ఉంటే ఈ ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన ద్వారా విజయ్ కూడా తన సెంటిమెంట్ ని చాటుకున్నారు అని అంటున్నారు. అలాగే ఆయన మొక్కులు చెల్లించడం ద్వారా తన భక్తి ప్రపత్తులను కూడా చాటుకున్నారని అంటున్నారు. ఇక దర్శనం అనంతరం విజయ్ చెన్నైకి ప్రయాణం అయ్యారు.
ఆధ్యాత్మికతతోనే :
ఇక తమిళనాడు ఎన్నికల వేళ కానీ ఆ తరువాత కానీ విజయ్ విషయంలో ఆధ్యాత్మిక వ్యవహారాల పట్ల చర్చ సాగింది. ఆయన పార్టీ నేతలు కూడా సనాతన ధర్మం విషయంలో డీఎంకే నేత ఉదయనిధి అన్న మాటలను సమర్ధించారు. దాంతో విజయ్ ఆధ్యాత్మికత విషయం గురించి కూడా చర్చ సాగింది. అయితే ఆయన తనలోని ఆధ్యాత్మికతను బయటకు చాటుకున్నారని అంటున్నారు. ఇక ఎంజీఆర్ జయలలిత అయితే ఆలయాలలో పూజలు నిర్వహిస్తూ వచ్చేవారు. ఇపుడు విజయ్ కూడా మొక్కులు చెల్లిస్తూ మూకాంబికా అమ్మ సన్నిధిలో గడపడంతో ఆయన కూడా మాజీ సీఎంల బాటలో నడుస్తున్నారు అని అంటున్నారు.