కవిత పార్టీ పేరు.. గుర్తు ఇదే..? షాక్ లో బీఆర్ఎస్ సేనలు..
తెలంగాణ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా తిరుగులేని శక్తిగా వెలిగిన బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు సొంత ఇంటి నుంmo ఊహించని సవాలు ఎదురుకాబోతుండడం గమనార్హం.;
తెలంగాణ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా తిరుగులేని శక్తిగా వెలిగిన బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు సొంత ఇంటి నుంmo ఊహించని సవాలు ఎదురుకాబోతుండడం గమనార్హం. గతేడాది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పాత పేరును, దాదాపు అదే తరహా గుర్తును ఎంచుకొని బీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా, మునీరాబాద్‌లో తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారు. పార్టీ పేరు నుంచి గుర్తు వరకు ఆమె వేస్తున్న అడుగులపై బీఆర్ఎస్ కంగారు పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘టీఆర్ఎస్’ ఖాళీగా ఉంది..
కవిత తన కొత్త పార్టీ పేరు విషయంలో బీఆర్ఎస్‌కు అతిపెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (TRS) నుంచి ‘భారత రాష్ట్ర సమితి’ (BRS) గా మార్చారు. ప్రస్తుతం ఈసీ రికార్డుల్లో ‘టీఆర్ఎస్’ పేరు ఖాళీగా ఉందని కవిత పేర్కొనడం గమనార్హం. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పేరుకు ఉన్న సెంటిమెంట్‌ను తిరిగి తన పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఎవరైనా వాడుకోవచ్చని ఆమె హింట్ ఇవ్వడం వెనుక, ఆ పేరుపై ఆమె ఇప్పటికే కన్నేసినట్లు స్పష్టం అవుతోంది.
'బస్సు’ గుర్తు!
పేరుతో పాటు పార్టీ గుర్తు విషయంలోనూ కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ గుర్తు ‘కారు’కు అత్యంత దగ్గరగా ఉండే ‘బస్సు’ గుర్తును ఆమె ఎంచుకున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో కారు, బస్సు గుర్తుల మధ్య ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. గతంలో ‘ట్రాక్టర్’, ‘రోలర్’ వంటి గుర్తుల వల్ల బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) నష్టపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కవిత స్వయంగా బస్సు గుర్తును తెస్తే, అది బీఆర్ఎస్ ఓటు బ్యాంకును భారీగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.
ఈసీ వద్ద పిటిషన్
కవిత ఎత్తుగడలను గమనించిన బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే అప్రమత్తమైంది. టీఆర్ఎస్ పేరును ఇతరులకు కేటాయించవద్దని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించే అవకాశం ఉందని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఒక పార్టీ గుర్తును పోలిన మరో గుర్తును కేటాయించకూడదనే నిబంధనను బీఆర్ఎస్ ఇక్కడ వాడుకునే అవకాశం ఉంది. బస్సు గుర్తు కారును పోలి ఉంటుందని అభ్యంతరం కూడా వ్యక్తం చేయవచ్చు.
‘బీఆర్ఎస్ ప్రస్తుతం స్లీపింగ్ మోడ్‌లో ఉంది’ అని వ్యాఖ్యానించిన కవిత, ఏప్రిల్ 25న పార్టీ జెండాను ఆవిష్కరించబోతున్నట్లు స్పష్టం చేశారు. తన ప్రధాన యుద్ధం కాంగ్రెస్‌తోనే అని ఆమె చెబుతున్నప్పటికీ, ఆమె ఎంచుకున్న పేరు, గుర్తు మాత్రం బీఆర్ఎస్ మనుగడకే ముప్పుగా మారేలా కనిపిస్తున్నాయి. గజ్వేల్ లేదంటే సిద్దిపేట వంటి కీలక స్థానాల నుంచి పోటీకి ఆమె సిద్ధమని ప్రకటించడం, కేసీఆర్, హరీష్ రావును టార్గెట్ చేస్తానని సవాలు విసరడం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.