కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య చెడిందా?

Update: 2020-12-23 15:30 GMT
కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అన్నదమ్ముల వైఖరితో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.  పీసీసీ పీఠమే వారి మధ్య కుంపటి పెట్టిందటూ ప్రచారం  జరుగుతోంది.

పీసీసీ విషయంలోనే బ్రదర్స్ మధ్య యవ్వారం బెడిసికొట్టిందనీ సొంత పార్టీ నాయకులే ప్రచారం మొదలెట్టేశారు. ఈ నేపథ్యంలోనే కొందరు పార్టీలో ఇమడలేక బయటికొచ్చేశారు. కానీ దగ్గరి అనుచరులు మాత్రం బ్రదర్స్ లో అంతర్గత విభేదాలా ? అబ్బెబ్బే అలాంటిదేం లేదని ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ఎలాగూ అధికారంలో లేరు కదా ఇప్పుడు అనవసరమైన దూకుడు ఎందుకని  సైలెంట్ గా ఉన్నారని కొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఎలాగూ పీసీసీ మార్పు అంశం హై కమాండ్ పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు తొందరపడొద్దనే భావనలో కోమటిరెడ్డి సోదరులు ఉన్నారని వారి అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే బీజేపీ గూటికి వెళ్తారనే ప్రచారం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి బాగా డ్యామేజ్ అయ్యింది కాబట్టి ఆచి తూచి అడుగులు వేయాలని ఆయన చూస్తున్నట్టు టాక్. ఇక వెంకట్ రెడ్డి మాత్రం మునుగోడులో కాలుమోపేందుకు ఎందుకు సుముఖంగా లేరనే దానిపై పెదవి విప్పడం లేదు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో పీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం కాంగ్రెస్ హై కమాండ్ కసరత్తు మొదలు పెట్టింది. స్వయంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మానికం ఠాగూర్ గాంధీభవన్‌లో కూర్చొని మరి హస్తం పార్టీ నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. 162మంది నేతలు హాజరై తమ అభిప్రాయాలు తెలిపారు. మరికొందరు ఆశావహులు ఢిల్లీ బాటపట్టారు. కాంగ్రెస్ నాయకులు వర్గాలుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం జరుగుతున్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. ఇంత జరుగుతోన్న రాజగోపాల్ రెడ్డి మాత్రం గాంధీభవన్ వైపు కన్నెత్తి చూడలేదు. కొత్త ఇంచార్జి మానిక్కం ఠాగూర్‌ను కలవలేదు. తన అభిప్రాయం ఏంటో చెప్పలేదు. నిజానికి ఉత్తమ్ నాయకత్వాన్ని మొదటి నుంచి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అతన్ని పీసీసీ పీఠం నుంచి తప్పించాలని బహిరంగానే డిమాండ్ చేసిన మొదటి నేత. ఉత్తమ్ పై అనేకసార్లు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అలాంటిది ఉత్తమ్ స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రక్రియ జరుగుతుంటే మాత్రం ఆయన అంటీ ముట్టనట్లు ఉంటున్నారు.

రాజగోపాల్ రెడ్డి తీరుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి అనుకూల కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు. ఏకంగా తన అనుచరులు, అభిమానులతో సమావేశాలు పెట్టి బీజేపీలోకి వెళుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ హస్తం పార్టీలో తన అనుచరుల్లో మెజార్టీ బీజేపీలోకి తన వెంట నడవడానికి ససేమిరా అనడంతో రాజగోపాల్ రెడ్డి కమలం గూటి ప్రయాణానికి అప్పట్లో బ్రేకులు పడ్డాయి.

 ఇక ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ మంచి దూకుడు మీద ఉంది. అటు దుబ్బాక, ఇటు జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాత అందరి చూపు ఆ పార్టీ వైపే పడుతోంది. ఆ పార్టీ సైతం కలిసొచ్చే కాంగ్రెస్ నాయకులకు బీజేపీ కండువా కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జాతీయ స్థాయి నాయకులు రంగంలోకి దిగి సంప్రదింపులు జరుపుతున్నారు. దాంతో విజయశాంతి వంటి నేతలు ఇప్పటికే గులాబీ కండువా కప్పుకున్నారు. అదే బాటలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం పయనిస్తారనే ప్రచారం మళ్ళీ ఇప్పుడు జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను లైట్ తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. అన్న పీసీసీ అయితే ఓకే లేదంటే బీజేపీలోకి రాజగోపాల్ జంప్ చేయడం ఖాయమని అంటున్నారు.
Tags:    

Similar News