టీఆర్ ఎస్‌ కు ఆ సోయి లేద‌న్న కోదండరామ్‌

Update: 2016-11-05 05:02 GMT
టీఆర్ ఎస్ సార‌థ్యంలోని రాష్ట్ర స‌ర్కారుపై తెలంగాణ జేఏసీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్ త‌న  విమ‌ర్శ‌ల దాడిని పెంచారు. రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్షాల పార్టీల‌ కంటే కోదండ‌రామ్‌కే ఎక్కువ విశ్వ‌స‌నీయ‌త ఉన్న నేప‌థ్యంలో వివిధ ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు మ‌ద్ద‌తివ్వాల్సిందిగా ప‌లువురు ఆయ‌న్ను కోర‌డం - స‌ద‌రు ప్ర‌తిపాద‌న‌కు కోదండ‌రామ్  మ‌ద్ద‌తివ్వ‌డం జ‌రిగిపోతోంది.  ఇదే రీతిలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం ఫరూఖ్‌ నగర్‌ మండల మొగిలిగిద్ద గ్రామంలో గత 18 రోజులుగా కొనసాగుతున్న రిలేనిరాహార దీక్షను కోదండ రామ్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి కోదండ రామ్ మాట్లాడుతూ స‌ర్కారు తీరుపై మండిప‌డ్డారు. ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజల అభిష్టాన్ని పట్టించుకునే స్థితిలో అధికార టీఆర్ ఎస్‌ పార్టీ లేదని విమర్శించారు.

ప్ర‌జ‌ల ఆకాంక్ష కోణంలో రాష్ట్రం ఏర్ప‌డితే అదే రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన టీఆర్ ఎస్ సార‌థ్యంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసిందని కోదండ‌రామ్ ఆరోపించారు. కొత్త జిల్లాలు, మండలాలను అశాస్త్రీయంగా ఏర్పాటు చేశారని అన్నారు. జిల్లా, మండలాల ఏర్పాటుకు ఓ కమిషన్‌ వేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ఉంటే బాగుండేదని అయితే ప్రభుత్వం ఒంటెద్దు పోకడతోనే రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని కోదండ రామ్ పేర్కొన్నారు. పాలమూరు జిల్లాతో ఎంతో అనుబంధాన్ని పెనవేసుకున్న షాద్‌నగర్‌ను భూబకాసురుల కోసమే రంగారెడ్డిలో విలీనం చేశారని కోదండ రామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు, పాలనకు అనువైనచోట మండలాలు ఏర్పాటు చేయకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మండలాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటిస్తున్న ప్రభుత్వం మొగిలిగిద్ద గ్రామస్తులు చేస్తున్న ఆందోళనలు, ఆకాంక్ష కనిపించడంలేదా అని కోదండ రామ్‌ నిలదీశారు. అడ్డగోలుగా జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేస్తే ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు. ఘనమైన చరిత్ర ఉన్న మొగిలిగిద్దను గుర్తించి మండలంగా ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుత పాలకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని కోదండ‌రామ్‌ హెచ్చరించారు. షాద్‌నగ ర్‌ ప్రాంతానికి జిల్లా ఏర్పాటయ్యే సామర్థ్యం ఉందని, కానీ ఇక్కడి అసమర్థ ఎమ్మెల్యే కారణంగానే అది చేజారిందని పాలమూరు అధ్యాయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి అన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చ కుంటే రాళ్లతో కొడతారని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయ కుడు మంగులాల్‌నాయక్‌ అన్నారు. ఎమ్మెల్యే ఊర్లను దత్తత తీసుకుంటే చాలదని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మొగిలిగిద్దను మండలంగా ఏర్పాటు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News