మూడు నెలల లోపే రెట్టింపు... వెండి ధరలు కొండెక్కడానికి కారణం..!
అవును... కొనుగోలుదార్లకు ఆందోళన, పెట్టుబడిదార్లకు ఆనందం కలిగిస్తూ వెండి ధరలు కొండెక్కుతున్నాయి. ఒక్క ఈ నెలలోనే వెండి కిలో ధర రూ.2.40 లక్షల నుంచి రూ.3 లక్షలకు పైగా పెరిగింది.;
భారతదేశంలో వెండి ధరలు కొండెక్కుతున్నాయి. ఈ క్రమంలో తొలిసారిగా కేజీ వెండి రూ.3 లక్షలు దాటి, రికార్డు స్థాయిలో గరిష్ట స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ బులియన్ విపణిలో సోమవారం రాత్రి కిలో వెండి ధర రూ.3,09,700 వద్ద స్థిరపడగా.. అది మంగళవారం నాటికి రూ.3,30,000కి చేరిందనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది! అయితే... వెండి ధరలు ఈ స్థాయిలో కొండెక్కడానికి అంతర్జాతీయంగా పలు కీలక అంశాలు కారణంగా ఉన్నాయని అంటున్నారు.
అవును... కొనుగోలుదార్లకు ఆందోళన, పెట్టుబడిదార్లకు ఆనందం కలిగిస్తూ వెండి ధరలు కొండెక్కుతున్నాయి. ఒక్క ఈ నెలలోనే వెండి కిలో ధర రూ.2.40 లక్షల నుంచి రూ.3 లక్షలకు పైగా పెరిగింది. వాస్తవానికి దీపావళి సమయంలో ధర బాగా పెరిగినా.. పండగ తరవాత అక్టోబరు - 2025 నెలాఖరు సమయానికి కిలో వెండి ధర రూ.1.48 లక్షలకు దిగి వచ్చింది. అనంతరం మళ్లీ అవిరామంగా పెరుగుతూ... అక్కడ నుంచి 3 నెలలు కూడా గడవకముందే రెట్టింపుకు మించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో... ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడటం, గ్రీన్ లాండ్ స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. సురక్షితమని భావిస్తూ బంగారం, వెండిపైకి పెట్టుబడులు రావడమే వీటి ధరల పెరుగుదలకు కారణమని అంటున్నారు. ఇదే సమయంలో... కొత్త ఇంధన రంగాలు, విద్యుత్తు వాహనాల తయారీ రంగాలలో వెండికి ఉన్న గిరాకీ అంతకంతకూ పెరుగుతుండటం కూడా ఈ ధరల భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన నిపుణులు... బంగారంలా కాకుండా, బహుళ రంగాలలో వెండి గొప్ప పారిశ్రామిక వినియోగాన్ని కలిగి ఉందని.. వీటిలో సౌర ఫోటోవోల్టాయిక్ ప్యానెల్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని.. ఇవన్నీ పెద్ద మొత్తంలో వెండిని ఉపయోగిస్తాయని.. ఇది నిర్మాణాత్మక డిమాండ్ కు మరింత దోహదం చేస్తుందని.. ఇది పెట్టుబడుల ఉద్దేశ్యాలకు మించి కదులుతుందని అంటున్నారు. ఈ నేపథ్యలో ఈ ఏడాదిలో జనవరి మద్య నాటికే 30% రాబడిని అందించిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యలో... ఏఐ సంబంధిత పరిశ్రమలలో పెట్టుబడులు స్మార్ట్ గ్రిడ్ మౌలిక సదుపాయాలు, డేటా ట్రాన్స్ మిషన్ తో సహా విస్తృత స్థాయిలో అప్లికేషన్ లలో వెండి డిమాండ్ ను పెంచుతున్నాయని.. పెట్టుబడి స్థాయిలు రాబోయే కొన్ని సంవత్సరాలకు వృద్ధి వనరుగా ఏఐ సంబంధిత వెండి డిమాండ్ ను చూసేలా చేస్తాయని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ హెచ్.ఎస్.బీ.సీ.లో చీఫ్ ప్రెషియస్ మెటల్స్ అనలిస్ట్ జేమ్స్ స్టీల్ అన్నారు.
కాగా... ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం.. జనవరి 1, 2025న కిలో వెండి ధర రూ.86,017గా ఉండగా.. ఇది భారతదేశంలో ఆల్ టైమ్ గరిష్టం. ఇక.. ఒక నెల తర్వాత ఫిబ్రవరి 3న వెండి రూ.7,516 పెరిగి రూ.93,533కి చేరుకుంది. ఈ వేగం కంటిన్యూ అవుతూ 2025 చివరి నాటికి 170% పెరిగింది. ఈ క్రమంలో తాజగా రూ.3 లక్షలు దాటి కొండెక్కింది!
1980లో 700% పెరిగిన వెండి ధరలు!:
వెండి ధరలు ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి కాదు. 1980లో కూడా ప్రపంచవ్యాప్తంగా వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని, ఎవరూ ఊహించని విధంగా రికార్డు స్థాయిలో పెరిగాయి. అందుకు కారణం హంట్ బ్రదర్స్ కాగా.. అనంతరం వారి వల్లే గరిష్ట స్థాయిలో పెరిగిన ధరలు దాదాపు 50%ని హఠాత్తుగా పడిపోయాయి. ఈ సందర్భంగా వారు చేసిన వ్యవహారం.. ఆ పని వారి వ్యాపార జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూద్దామ్...!
1970లలో డాలర్ బలహీనపడుతోన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ 1971లో బంగారు ప్రమాణాన్ని ముగించారు.. యూఎస్ డాలర్, బంగారం ధరల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని విచ్ఛిన్నం చేశారు. ఆ సమయంలో.. ద్రవ్యోల్బణం, ఇరాన్ విప్లవం, సోవియట్ - ఆఫ్ఘన్ యుద్ధం కారణంగా పెట్టుబడిదారులు వెండి వైపు మొగ్గు చూపారు. ఈ కాలంలో.. ఇద్దరు అమెరికన్ బిలియనీర్ సోదరులు.. నెల్సన్ బంకర్ హంట్, విలియం హెర్బర్ట్ హంట్ కలిసి వెండి కొనడం ప్రారంభించారు.
ఈ క్రమంలో... వారిరువూ కలిసి సుమారు 100 మిలియన్ ఔన్సుల కంటే ఎక్కువ వెండిని కొనుగోలు చేశారు. ఇది ప్రపంచంలోని మొత్తం సరఫరాలో మూడింట ఒక వంతు. అంతా వారు అనుకున్నట్లుగానే సాగుతుంది. 1970ల ప్రారంభంలో హంట్ బ్రదర్స్ వెండి కొనడం ప్రారంభించినప్పుడు ధర ఔన్సుకు $2గా ఉండేది. 1979 నాటికి అది $6కి చేరుకుంది. 1980లో ఔన్సుకు $50కి చేరుకుంది. అంటే.. ఒక సంవత్సరం లోపు వెండి మొత్తం 713% పెరిగింది.
సరిగ్గా ఈ సమయంలో.. 1980 జనవరి 7న కోమెక్స్ 'సిల్వర్ రూల్ 7'ని ప్రవేశపెట్టింది. ఇది మార్జిన్ పై వస్తువులను కొనడంపై పరిమితులను విధించింది. ఈ క్రమంలో... 'సిల్వర్ థర్స్ డే' అని పిలువబడే మార్చి 27, 1980న హంట్ బ్రదర్స్ మార్జిన్ కాల్ మిస్ అయ్యారు. అంటే వారు అవసరమైన డబ్బు చెల్లించడంలో విఫలమయ్యారు. ఫలితంగా.. బ్రోకర్లు వెండిని అమ్మడం ప్రారంభించడంతో ఒకే రోజులో దాని ధర 50% కంటే ఎక్కువ పడిపోయింది.
ఫలితంగా... ఇద్దరు సోదరులకు ఒక్కొక్కరికి $10 మిలియన్లు జరిమానా విధించబడింది. వీరిద్దరూ జీవితాంతం వ్యాపారం చేయకుండా నిషేధించబడ్డారు. ఈ క్రమంలో 1988నాటికి వీరిద్ధరూ పూర్తిగా దివాళా తీశారు. ఆ సమయంలో వెండి ధరలు 90% తగ్గి $4.90కి చేరుకున్నాయి!