మోడీ కాకుండా బీజేపీలో ప్రధాని ఎవరైనా కాగలరా ?

బీజేపీ ఒక పార్టీగా ప్రజాస్వామ్య విలువల గురించి ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతూ వస్తున్నారు. తమ పార్టీలో ఒక అతి సామాన్య కార్యకర్త కూడా పార్టీ జాతీయ అద్యక్షుడు అవుతారని అంటూంటారు.;

Update: 2026-01-20 13:30 GMT

బీజేపీ ఒక పార్టీగా ప్రజాస్వామ్య విలువల గురించి ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతూ వస్తున్నారు. తమ పార్టీలో ఒక అతి సామాన్య కార్యకర్త కూడా పార్టీ జాతీయ అద్యక్షుడు అవుతారని అంటూంటారు. బీజేపీకి నూతన అధ్యక్షుడిగా నెగ్గిన నితిన్ నబీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్త పార్టీ ప్రెసిడెంట్ కావడం కేవలం బీజేపీలో మాత్రమే సాధ్యమని ప్రకటించారు. అయితే దీని మీద సెటైర్లు విమర్శలు ఆ వెంటనే వస్తున్నాయి.

మోడీ తప్ప ఎవరున్నారు :

బీజేపీ గతంలో ఆరేళ్ళు ప్రస్తుతం పన్నెండేళ్ళ పాటు అధికారంలో ఉంది. గతంలో వాజ్ పేయి ఆరేళ్ళ పాటు పాలించారు. 2004లో పార్టీ మరోసారి గెలిస్తే సీనియర్ నేత ఎల్ కే అద్వాని ప్రధాని అవుతారని అనుకున్నారు. ఆ విధంగా తన సహచరుడికి చోటు అయితే వాజ్ పేయి కల్పించారు కానీ జనామోదం లేక బీజేపీ ఓటమి పాలు అయింది. అలా అద్వానీ ప్రధాని మంత్రిత్వం వెనక్కి పోయింది. ఇక 2014లో నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి నేరుగా ప్రధాని అయ్యారు. నాటి నుంచి నేటి వరకూ మోడీయే బీజేపీలో ప్రధానిగా ఉన్నారు. దాంతో మోడీ తప్ప బీజేపీలో ప్రధాని పదవికి యోగ్యులు ఎవరూ లేరా ఆ అర్హత లేదా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది.

ఎంతో మంది సీనియర్లు :

నిజానికి బీజేపీలో జాతీయ స్థాయిలో అధ్యక్ష పదవులు నిర్వహించి దశాబ్దాలుగా పనిచేసిన ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. కానీ మోడీ తప్పించి బీజేపీలో ప్రధాని పదవి మాత్రం వారిలో ఎవరికీ దక్కడం లేదు అన్న చర్చ అయితే ఉంది. వరసగా మూడు సార్లు బీజేపీ గెలిస్తే మోడీ తప్ప మరో నాయకుడిని ఆ పార్టీ ఎన్నుకోలేకపోతోంది అని విమర్శలు ఉన్నాయి. మరి బీజేపీ ప్రజాస్వామ్యం అక్కడ వర్తించదా అన్న చర్చ కూడా సాగుతోంది.

నాలుగవ సారి అంటూ :

మూడు సార్లుగా బీజేపీ నుంచి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ 2029లో కనుక బీజేపీ గెలిస్తే నాలుగోసారి కూడా ప్రధాని కావాలని ఆయన అనుచరులు కోరుకుంటున్నారు. అంటే మోడీ ఒక్కరే ప్రధాని పదవికి అర్హత కలిగిన వారుగా ఉన్నారా మరో సీనియర్ లేరా అన్నదే ప్రశ్నగా ముందుకు వస్తోంది. అంతే కాదు బీజేపీ ప్రవచిస్తున్న ఈ సిద్ధాంతాలు అన్నీ కేవలం అధ్యక్ష పదవికే తప్ప ప్రధాని పదవికి మాత్రం వర్తించవా అన్నది కూడా అంతా ప్రశ్నిస్తున్నారు.

నిబంధనలు తూచ్ :

ఇక ఏడున్నర పదుల వయసు మీరిన వారి అధికార పదవులు చేపట్టరాదని ఎన్నికల్లో పోటీ చేయరాదని క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని అపుడెపుడో బీజేపీ రూల్స్ ఫ్రేం చేసింది అని చెప్పుకున్నారు. దాని ప్రకారం బీజేపీలో వరిష్ట నేతలు అంతా సైడ్ అయిపోయారు. మరి ఏడున్నర పదుల వయసు నిండిన నరేంద్ర మోడీ మాత్రం ఇంకా ప్రధానిగా అత్యంత కీలక పదవిలో కొనసాగుతున్నారని గుర్తు చేస్తున్నారు. మరి బీజేపీ తానుగా ప్రవచిస్తున్న నిబంధనలు రూల్స్ అన్నీ కూడా కొందరికే పరిమితమా అన్న చర్చ కూడా ఉంది.

అధికారం మాత్రం :

ఏ రాజకీయ పార్టీలో అయినా అధికారంలో ఉంటే ప్రధాని ముఖ్యమంత్రి పదవులే కీలకంగా ఉంటాయి. అక్కడే అసలైన అధికారం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉంటే పార్టీ పదవులు గొప్పగా ఉంటాయి. మరి అధికారంలో ఉన్నపుడు ఇవ్వాల్సింది కీలక పదవులు కదా అవి కదా అసలైన కార్యకర్తలకు న్యాయం చేసేది అన్న చర్చ కూడా సాగుతోంది. సమర్ధత అనుభవం కారణంగా కార్యకర్తలకు పార్టీ పదవులు దక్కుతున్నాయని చెబుతున్న బీజేపీ పెద్దలు అదే అనుభవం సీనియారిటీ ప్రధాని వంటి పదవులకు సరిపోవడం లేదా అని అంటున్నారు. తేడా పార్టీ అని చెప్పుకునే బీజేపీలో ఈ తేడా ఎక్కడ నుంచి వస్తోంది అన్న ప్రశ్నకు బహుశా కమలనాధుల వద్ద జవాబు అయితే ఉండకపోవచ్చు. తెలిసినా నోరు మెదపక పోవచ్చు అని సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News