అడవులను నరికేస్తున్న పాపం... మనిషికి దోమల రూపంలో పండుతోంది..!
అడవులను విపరీతంగా నరికేయడం వల్ల మనిషికి ఎన్నో ఇబ్బందులు వస్తున్న సంగతి తెలిసిందే.;
అడవులను విపరీతంగా నరికేయడం వల్ల మనిషికి ఎన్నో ఇబ్బందులు వస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ నరికివేత విషయంలో సమస్యలు అతడికి అర్ధం కావడం లేదో.. తమ వరకూ రాదులే అనుకుంటున్నాడో తెలియడం లేదని అంటున్నారు పరిశీలకులు. అడవులను నరికేయడం వల్ల జంతువులు జనావాసాల్లోకి వస్తోన్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జంతువులే కాదు.. ఇకపై దోమలు పూర్తిగా మనుషుల రక్తమే లక్ష్యంగా మారుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
అవును... బ్రెజిల్ లోని అట్లాంటిక్ అడవిలో జరిపిన ఒక అధ్యయనంలో.. జీవవైవిధ్య నష్టం కొనసాగుతుండటం వల్ల ఒకప్పుడు వివిధ రకాల జీవులను, జంతువులను తిన్న దోమలు.. ఇప్పుడు మానవ రక్తం పట్ల ప్రాధాన్యతను పెంచుకుంటున్నాయని తేలింది. అడవి అసలు ప్రాంతంలో కేవలం 30 శాతం మాత్రమే చెక్కుచెదరకుండా ఉందని.. దీంతో దోమలు జనావాసాలపైనే దృష్టి సారిస్తున్నాయని బ్రెజిల్ లోని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో డి జనీరో, ఓస్వాల్డో క్రజ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు.
వాస్తవానికి... బ్రెజిల్ లోని అట్లాంటిక్ తీరం వెంబడి పరాగ్వే నుంచి అర్జెంటీనా వరకు విస్తరించి ఉన్న ఈ అడవి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జీవవైవిధ్య హాట్ స్పాట్ అని.. ఇక్కడ వేలాది వృక్ష, జంతు జాతులు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఈ అటవీ ప్రాంతం రోజు రోజుకీ కుచించుకుపోతుందని చెబుతున్నారు. ప్రధానంగా మానవ ఉనికి.. వాటిని తమ ఆవాసాలకు దూరం చేయడమే ఇందుకు ప్రధాన కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది.
ఫ్రాంటియర్స్ ఇన్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్ లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో.. రియో డి జనీరో రాష్ట్రంలోని సిటియో రెకాంటో ప్రిజర్వర్, గ్వాపియాకు రివర్ ఎకోలాజికల్ రిజర్వ్ అనే రెండు అట్లాంటిక్ అటవీ ప్రాంతాల నుండి పట్టుకున్న 1,700 కి పైగా దోమల ఆహార వనరులను గుర్తించింది. ఈ సమయంలో వాటిలో 52 జాతులకు చెందిన 145 ఆడ దోమలలో 24 దోమలు తినే రక్త భోజనాన్ని గుర్తించగలిగామని.. ఇందులో గరిష్టంగా దోమలు మనిషి రక్తాన్ని రుచి మరిగినట్లు గుర్తించామని అంటున్నారు!
ఈ సందర్భంగా స్పందించిన రియో డి జనీరో ఫెడరల్ యూనివరిస్టీలో మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ పరిశోధకుడు, సహ రచయిత సెర్గియో మచాడో... ఇది చాలా కీలకమని.. అట్లాంటిక్ ఫారెస్ట్ వంటి వాతావరణంలో అనేక రకాల దోమలు.. ఆహారం కోసం మానవులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వ్యాధికారక వ్యాప్తి ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని అన్నారు. అడవి తగ్గిపోవడంతో దోమలు తమ అలవాట్లను, ఆవాసాలను మార్చుకుని మానవుల దగ్గరకు వెళ్తున్నాయని తెలిపారు.