ఎమ్మెల్సీ బరిలోకి కోదండరాం.. టీజేఎస్ కీలక నిర్ణయం

Update: 2020-08-25 05:15 GMT
2021 ఫిబ్రవరిలో తెలంగాణలో  ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)  నిర్ణయం తీసుకుంది. అందులో వరంగల్‌,ఖమ్మం,నల్లగొండ నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్ ‌ను బరిలో  దించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వచ్చే  సమావేశంలో నిర్ణయం జరగడం సూత్రప్రాయమే అని పలువురు టీజేఎస్‌ నేతలు తెలిపారు. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ నుంచి పార్టీ అధ్యక్షుడు కోదండరాం పోటీ చేయాలని నేతలు అన్నారు. అయితే ఏ నిర్ణయమైనా పార్టీ సమిష్టిగా తీసుకోవాలని కోదండరాం స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో  వీలైనంత త్వరగా మరోసారి సమావేశమై అభ్యర్థులపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే , మరోసారి భేటీ అయ్యేలోపు  ఇతర పార్టీలు, సంఘాల నేతల అభిప్రాయాలు, మద్దతు కూడగట్టాలని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉంది.  ఇక, 2018 ఎన్నికల్లో తాము పోటీ చేసిన దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో,  దానిపై నివేదిక తయారు చేసేందుకు కమిటీని వేయాలని నిర్ణయించారు. అలాగే దుబ్బాకలో జరగనున్న ఉప ఎన్నికలో కూడా పోటీ చేయాలని పార్టీ వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. అయితే అక్కడ అభ్యర్థిగా ఎవరిని దింపాలి.. పోటీ చేస్తే పరిస్థితి ఏంటి..? గెలుపోటముల అవకాశాలు ఎలా ఉంటాయన్న అంశంపై అధ్యయనం చేసి, నివేదిక అందజేసేందుకు ముగ్గురు సీనియర్‌ నేతలతో కమిటీ వేయాలని నిర్ణయించారు.
Tags:    

Similar News