రిటైర‌య్యాక కోదండరాం ప‌రిస్థితి ఏంటి?

Update: 2015-08-02 07:48 GMT
కోదండరాం.... తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ గా రాష్ర్ట సాధ‌న పోరాటంలో క్రియాశీల‌క పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజే ఏసీకి ఆయన సారథి. ఉద్యోగ సంఘాలను,రాజకీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ముందుకు నడిపించిన ఘనత ఆయనదే అని చెప్పాలి. ఆయన సారథ్యంలో  తెలంగాణ ఉద్యమానికి ఓ ఊపు వచ్చింది. జేఏసీ చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో కోదండరామ్‌ ది కీలక పాత్ర. కానీ ప్రత్యేక రాష్ట్రం సాకారమవడంతో కోదండరాం దూకుడు తగ్గింది.

జేఏసీలో కీలకంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలకు  అదృష్టం వరించింది. స్వామిగౌడ్‌ కు ఎమ్మెల్సీ పదవితో పాటు మండలి చైర్మన్ పీఠం ద‌క్కింది. మరో నేత శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. మరో నాయ‌కుడు విఠల్‌ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌  కమిషన్‌ సభ్యుడిగా అవకాశమిచ్చారు కేసీఆర్‌. అయితే కోదండరాం ప్రభుత్వానికి, టీఆర్‌ ఎస్‌ కు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం ప్రొఫెసర్‌ గా తిరిగి డ్యూటీలో చేరారు. అడపాదడపా జేఏసీ స్టీరింగ్‌ కమిటీ  సమావేశం నిర్వహిస్తున్నారు. విభజన చట్టం, అమరవీరుల జాబితా, సచివాలయం తరలింపు లాంటి అంశాలపై ఆయన పలుమార్లు  మాట్లాడారు. కానీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించికుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

కోదండరాం ప్రొఫెసర్‌ గా వచ్చే నెలలో రిటైర్‌ కాబోతున్నారు. తాను ఉద్యమ నాయకుడిగానే ఉండాలని  కోదండరాం అనుకుంటున్నారట. ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమ పంథాను కొనసాగించాలని భావిస్తున్నారట. ఏదైనా పార్టీలో  చేరితే మిగిలిన పక్షాలకు దూరమవుతానన్న భావనలో ఆయన ఉన్నట్టు సమాచారం. అందుకే తిరిగి ప్రజా సంఘాలతో కలిసి పనిచేయాలన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. సెప్టెంబర్‌  తర్వాత కోదండరాంని మరోసారి ఉద్యమ నేతగా చూడబోతారన్న చర్చ ఆయన సన్నిహితుల్లో జరుగుతోంది.
Tags:    

Similar News