కాంగ్రెస్ తో బంధంపై కిర‌ణ్ కామెడీ

Update: 2018-07-13 11:15 GMT
న‌చ్చ‌న‌ప్పుడు పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోవ‌టం రాజ‌కీయ నేత‌ల‌కు అల‌వాటే. అయితే.. రోజులు గ‌డిచిన త‌ర్వాత కంపు అనిపించిన పార్టీనే ఇంపుగా అనిపించ‌టం.. వెళ్లినప్పుడు చేసిన డ్యామేజీ వ్యాఖ్య‌ల‌కు ఎంట్రీ వేళ క‌వ‌ర్ చేయ‌టం మామూలే. తాజాగా అలాంటి ప‌నే చేశారు న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి. కాకుంటే.. ఆయ‌న మాట‌లు అతికిన‌ట్లుగా లేవు క‌దా.. కామెడీ కామెడీగా మారాయి.

కాంగ్రెస్ పార్టీతో త‌న బంధం విడ‌దీయ‌లేనిదంటూ కిర‌ణ్ చేసిన వ్యాఖ్య‌లపై ఎట‌కారం చేసుకుంటున్నారు. మ‌రి.. అంత బంధ‌మే ఉంటే.. తెంచుకుపోయేట‌ప్పుడు ఏమైంది బాసూ అన్న ప్ర‌శ్న‌లే కాదు.. సొంత పార్టీ పెట్టేసుకున్నారుగా.. ఎందుకో? అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చిన కిర‌ణ్ త‌ర్వాత విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తో త‌న‌కు.. త‌న కుటుంబానికి ఉన్న బంధం గురించి మాట్లాడారు. త‌న తండ్రికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. త‌న‌ను మ‌రో నాలుగుమార్లు ఎమ్మెల్యేగా గెలిచామంటే అదంతా కాంగ్రెస్ పార్టీ పుణ్య‌మేన‌ని చెప్పుకున్నారు. గాంధీ ఫ్యామిలీతో తాను స‌న్నిహితంగా మెల‌గ‌టం వ‌ల్లే తాను చీఫ్ విప్.. స్పీక‌ర్.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వుల్ని చేప‌ట్టిన‌ట్లుగా చెప్పారు.

తాను దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిన‌ని.. కాంగ్రెస్ పార్టీలోకి రావ‌టం సంతోషంగా ఉంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీని వ‌దిలి వెళ్లిన 30-40 మంది నేత‌ల్ని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప‌ని చేస్తాన‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే విభ‌జ‌న హామీలు నెర‌వేరుతాయ‌న్న ఆయ‌న‌.. ఏపీకి ప్ర‌త్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్య‌మ‌ని చెప్పుకొన్నారు. పార్టీలో ఎంట్రీ ఇచ్చిన వేళ‌.. ఇన్నేసి గొప్ప మాట‌లు చెబుతున్న కిర‌ణ్.. ఇదే పార్టీని విడిచిపెట్టి వెళ్లిన‌ప్పుడు అంతే అగ్రెసివ్ గా ఉన్నారు. కాలానికి అనుగుణంగా.. కాంగ్రెస్ తో బంధాలు మారిపోతాయి క‌దా కిర‌ణ్‌..?
Tags:    

Similar News