వంగవీటి కీలక నిర్ణయం ?

Update: 2021-09-23 06:30 GMT
విజయవాడ బేస్ గా రాజకీయాలు చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ నియోజకవర్గం మారబోతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కేంద్రంగా రాధా రాజకీయాలు చేస్తుంటారు. అయితే ఈ నియోజకవర్గం రాధాకు అంతగా అచ్చిరాలేదనే చెప్పాలి. దాదాపు 20 ఏళ్ళ రాజకీయ కెరీర్లో ఒకే ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఎంఎల్ఏగా గెలిచారు. నిజానికి చాలామందికి దొరకని మంచి ప్లాట్ ఫారం రాధాకు దొరికింది.

తన తండ్రి వంగవీటి రంగాకు జనాల్లో ప్రత్యేకించి కాపుల్లో ఉన్న పట్టును రాధా నిలుపుకోలేకపోయారు. ఎంతసేపు తండ్రి పేరుచెప్పి రాజకీయాలు చేయాలనే కానీ తనకంటు సొంతంగా ఇమేజి బిల్డప్ చేసుకుందామన్న ఆలోచన రాధాలో కనబడలేదు. తండ్రి పేరును ప్రస్తావించేస్తే ఎన్నికల్లో తనకు జనాలు ఓట్లేసేస్తారు అనే భ్రమల్లో నుండి రాధా బయటపడుతున్నట్లు లేదు. 24 గంటలూ జనాల్లో తిరుగుతుంటేనే జనాలు ఓట్లేసేది గ్యారెంటీలేదు.

ఇలాంటి నేపధ్యంలో రాధా రాజకీయాన్ని జనాలు పట్టించుకోవటంలేదు. ఎందుకంటే రాధాకు బాగా బద్ధకం ఎక్కువని ప్రచారంలో ఉంది. ఏ పార్టీలో ఉన్నా జనాల్లో తిరిగేది తక్కువేనట. ఏదో అవసరమైనపుడు తప్ప ఇతర సమయాల్లో జనాల్లో తిరగటానికి రాధా పెద్దగా ఇష్టపడరనే టాక్ ఉంది. పైగా విజయవాడ అనేది నూరుశాతం అర్బన్ ఓటింగ్. అందుకనే రాధాను జనాలెవరు పట్టించుకోవటంలేదట. అందుకనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని వదిలేసి గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి ఫిష్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇందులో భాగంగానే గుడివాడ నియోజకవర్గంపై రాధా కన్నుపడిందని సమాచారం. ఇందులో భాగంగానే తరచు గుడివాడలో పర్యటిస్తున్నారట. మామూలుగా అయితే నియోజకవర్గంలో రెగ్యులర్ గా పర్యటించటం, జనాల్లో తిరగటం అన్నది రాధా మనస్తత్వానికి పూర్తి విరుద్ధం. కానీ ఇలాగే ఉంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని టెన్షన్ మొదలైనట్లుంది. అందుకనే నియోజకవర్గం మారితేనే రాజకీయాలు ఫ్రెష్ గా ఉంటుందని డిసైడ్ అయినట్లుంది.

వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి పోటీచేసే ఉద్దేశ్యంలో ఉంటే గెలుపు సాధ్యమేనా అనేది డౌటే. టీడీపీకి గుడివాడలో గట్టి నేత లేరన్నది వాస్తవం. కాబట్టి ఇక్కడినుండి రాధా పోటీచేయాలని అనుకుంటే టికెట్ ఇవ్వటానికి చంద్రబాబునాయుడుకు కూడా పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. కాకపోతే కమ్మ సామాజికవర్గం ఎంతో బలంగా ఉన్న గుడివాడలో వైసీపీ తరపున మంత్రి కొడాలినాని తిరుగులేకుండా గెలుస్తున్నారు. కాపులకు పట్టున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే గెలవలేని రాధా గుడివాడలో గెలవగలరా ? అన్నదే ఆసక్తిగా ఉంది.


Tags:    

Similar News