అవును.. ఆ ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారు

Update: 2016-08-28 06:01 GMT
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఆచితూచి వ్యవహరించాలి. నోటికి వచ్చినట్లుగా మాట్లాడకూడదు. ఒకవేళ.. మాట్లాడినా.. అందుకు తగ్గ ఆధారాలు ఉండాలి. ప్రత్యర్థులు వేలెత్తి చూపించే అవకాశం అస్సలు ఇవ్వకూడదు. కానీ.. అలాంటి విషయాన్ని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు కూడా విస్మరిస్తున్న చేదు నిజం తాజా పరిణామాల్ని చూస్తే అర్థమవుతుంది. తమ రాజకీయ ప్రత్యర్థులపై తరచూ తీవ్రస్థాయిలో విరుచుకుపడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనతో పాటు ఆయన సహచరులు కూడా అధినేత బాటలో నడవటంతో వారు సైతం కోర్టుకు హాజరు కాక తప్పలేదు.

గతంలో ఆయన మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబాల్ కుమారుడు అమిత్ సిబాల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక టెలికం కంపెనీ కోసం తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని లాభం పొందినట్లుగా ఆమ్ ఆద్మీపార్టీ అధినేత.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ ఆరోపణలతో తనకు పరువునష్టం జరిగిందంటూ కపిల్ సిబాల్ కొడుకు కేసు పెట్టారు.

ఈ కేసు విచారణ తాజాగా ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. ఈ కేసు విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్.. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు కోర్టు ఎదుట హాజరయ్యారు. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీ అధికారపక్షానికి చెందిన పలువురు నేతలు కోర్టుకు రావాల్సి వచ్చింది. అనంతరం.. ఈ కేసు విచారణను సెప్టెంబరు మూడో వారానికి వాయిదా వేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తాను చేసిన వ్యాఖ్యలకు కోర్టుకు వెళ్లాల్సిన రావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
Tags:    

Similar News