ఏసీబీ అధికారులకు 5 గంటలు చుక్కలు చూపించిన నాగరాజు

Update: 2020-08-17 04:15 GMT
ఒక భూవివాదాన్ని నిబంధనలకు విరుద్ధంగా మార్చేందుకు రూ.1.10 కోట్ల భారీ లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కీసర ఎమ్మార్వో నాగరాజు ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన్ను విచారించే క్రమంలో ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించినట్లుగా తెలుస్తోంది. ఆయన నుంచి సమాచారాన్ని రాబట్టటం చాలా కష్టమని చెబుతున్నారు.

లంచం తీసుకుంటూ దొరికిన పోయిన అతడు నింపాదిగా ఉండటమే కాదు.. అస్సలు టెన్షన్ పడకపోవటాన్ని కొందరు అధికారులు తమ అంతర్గత సంభాషణల్లో ప్రస్తావిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. నాగరాజు ఈమొయిల్ ఐడీ.. పాస్ వర్డ్ లు చెప్పేందుకు ఏసీబీ అధికారులకు ఐదు గంటల పాటు ముప్పతిప్పలు పెట్టినట్లుగా సమాచారం. ఏఎస్ రావు నగర్ లోని ఒకరింట్లో లంచం తీసుకుంటూ ఎమ్మార్వో నాగరాజు దొరకగా.. అనంతరం ఏసీబీ అధికారులు అల్వాల్ లోని అతనింట్లో తనిఖీలు నిర్వహించారు.

దాదాపు మూడు గంటల పాటు సోదాలు నిర్వహించిన పలు పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈమొయిల్ ఐడీ.. పాస్ వర్డ్ లను తెలుసుకోవటానికి ఏసీబీ అధికారులు చెమటలు చిందించాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఆయన్ను కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నాగరాజు ఒక్కడే ఇంత భారీగా లంచాల్ని తీసుకునే అవకాశం లేదని.. అతడి వెనుక మరిన్ని పెద్ద తలకాయలు ఉన్నాయన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భూరికార్డుల్ని మార్చటంలో నాగరాజు దిట్ట అని.. తిమ్మినిబమ్మిని చేసే టాలెంట్ నాగరాజుకు ఎక్కువని చెబుతున్నారు. ఎలాంటి వివాదానికి అయినా చిటికెలో సొల్యూషన్ చెప్పేయటమే కాదు.. తనకు అనుకూలంగా పలువురి ఉద్యోగుల్ని మార్చుకోవటంలో అతడి టాలెంట్ వేరంటున్నారు. ఏమైనా నాగరాజు నోరు విప్పి వివరాలు వెల్లడిస్తే.. చాలా పెద్ద విషయాలే బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News