కడప పెరిగింది...కూటమి మార్క్ పాలన

ఏపీలో అతి పెద్ద జిల్లా ఏది అంటే వైఎస్సార్ కడపనే ఇపుడు చెప్పుకోవాలి. తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసింది.;

Update: 2026-01-01 04:02 GMT

ఏపీలో అతి పెద్ద జిల్లా ఏది అంటే వైఎస్సార్ కడపనే ఇపుడు చెప్పుకోవాలి. తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసింది. అవి మార్కాపురం, పోలవరంగా ఉన్నాయి. అలాగే అయిదు రెవిన్యూ డివిజన్లు కొత్తగా ఆవిర్భవించాయి. అలాగే నియోజకవర్గాలలో మండలాల్లో మార్పులు చేర్పులు చేశారు. దాంతో గతంలో అతి పెద్ద జిల్లాగా ఉన్న అనంతపురం తాజా మార్పులతో తన నంబర్ వన్ ప్లేస్ కోల్పోయింది. ఆ స్థానంలోకి కడప జిల్లా వచ్చింది.

రాజంపేట విలీనంతో :

వైఎస్సార్ కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం కలవడంతో అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన లో భాగంగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం లోని నాలుగు మండలాలు రాజంపేట, నందలూరు, వీరబల్లె, సుండుపల్లె జిల్లాలో విలీనమైనట్లుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం 40 మండలాల తో రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు గల జిల్లాగా నిలిచిందని అన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

విలీనంతో పెద్ద జిల్లాగా కడప :

రాజకీయంగా చూస్తే కడప జిల్లా వైసీపీ పట్టు ఉందని చెబుతారు. అలాంటి చోట కొత్త జిల్లాల మార్పు చేర్పులలో భాగంగా ఏకంగా పెద్ద జిల్లా చేయడం విశేష పరిణామం అంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వం మార్క్ పాలనగా అంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు ఎటు వంటి వివక్ష లేకుండా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశ్యమని కూటమి నేతలు చెబుతున్నారు. అందులో భాగమే ఇపుడు కడప జిల్లాలో అధిక మండలల కూర్పు జరిగింది అని గుర్తు చేస్తున్నారు.

లోకల్ బాడీ ఎన్నికల్లో :

మరో వైపు చూస్తే 2026లో మండల ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎక్కువ మండలాలు ఉన్న కడప జిల్లాలో ఎవరికి ఎక్కువ సీట్లు దక్కుతాయన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా పాలనాపరంగా సరైన నిర్ణయం తీసుకున్నమని ప్రజామోదంతోనే తమ పాలన సాగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని కూటమి నేతలు అంటున్నారు.

Tags:    

Similar News