రాజ్యసభకు వినోద్ - కవిత..కేకేకు మంగళమేనా?

Update: 2019-12-15 14:30 GMT
టీఆర్ఎస్ లో ఇప్పుడు సీనియర్ నేత.. కేసీఆర్ తర్వాత అంతటి పెద్దరికం కేకే సొంతం. అయితే కేకే రాజ్యసభ సభ్యత్వం ముగియబోతోంది. ఈసారి ఆయనను పెద్దల సభకు కాకుండా మండలికి పంపుతారని టీఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది. కేకేకు రాజ్యసభ టికెట్ ను కట్ చేసి ఆయన సేవలను పార్టీలో ప్రభుత్వంలో వినియోగించుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.. ఇందులో కేకే సీటు ఒకటి కాగా.. రెండోది కాంగ్రెస్ నుంచి ఏంఏ ఖాన్ ది. కాంగ్రెస్ కు ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో ఈ సీటు కూడా టీఆర్ఎస్ పరం కావడం ఖాయమే. దీంతో ఈ రెండు సీట్లను కేసీఆర్ ఈసారి ఎవరికి ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

కేకేను ఈసారి కేసీఆర్ రాష్ట్రానికే పరిమితం చేసి ఈ రెండు సీట్లను టీఆర్ఎస్ అగ్రనేత వినోద్ తోపాటు తన కూతురు కవితకు కేసీఆర్ కట్టబెట్టబోతున్నారని గులాబీ వర్గాలు అంటున్నాయి.

కేకే తీరుతో కేసీఆర్ ఈ మధ్య ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేకే మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పి కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రగతి భవన్ కు పిలిపించి మరీ కేసీఆర్ మాట్లాడారట.. ఇక కొన్ని వివాదాల్లోనూ కేకే తీరు కేసీఆర్ కు వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నాడట.. దీంతో కేకేకు రాజ్యసభ రెన్యువల్ కాదనే చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది. కేకేను ఎమ్మెల్సీని చేసి మండలికి పంపిస్తారని.. కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవి ఇచ్చి రాష్ట్ర రాజకీయాలకు వాడుతారనే వాదన వినిపిస్తోంది.

అయితే కేకేకు రాజ్యసభ పదవి ఇవ్వకపోతే ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. సీనియర్ ను పక్కనపెట్టి కవిత, వినోద్ లను రాజ్యసభకు పంపితే దుమారం రేగడం ఖాయమంటున్నారు. కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News