అసెంబ్లీ సాక్షిగా విపక్షాలపై కేసీఆర్ పైచేయి

Update: 2017-01-19 04:53 GMT
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఏకంగా 18 రోజుల పాటు జరగటం విశేషం. దాదాపు 15 అంశాలపై లఘు చర్చలు జరగటం.. ఏకంగా 16 బిల్లులను అసెంబ్లీ ఆమోదించటం జరిగింది. సభ మొత్తం 94 గంటల 54 నిమిషాలపాటు జరగ్గా.. కేవలం గంట మాత్రమే సభకు అంతరాయం జరిగింది.

అంతేకాదు.. సుదీర్ఘంగా సాగిన సభకు మధ్యలో సంక్రాంతి సెలవులు ఇవ్వటం.. ఆ తర్వాత మళ్లీ సమావేశం అయింది. అటు పార్లమెంటులోనూ.. ఇటు వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ సమావేశాలు అరకొరగా సాగుతూ.. విపక్షాల ఆందోళనలతో సభను నిర్వహించలేకపోతున్న వేళ.. అందుకు భిన్నమైన పరిస్థితులు తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకోవటం గమనార్హం.

ప్రభుత్వ తీరు మీద విపక్షాలు విరుచుకుపడినా.. దాన్ని కంట్రోల్ చేయటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో విపక్షాల్ని బుజ్జగించటం.. మరికొన్ని సందర్భాల్లో విపక్షాలపైవిరుచుకుపడటం ద్వారా కేసీఆర్ పక్కా వ్యూహాన్నిఅమలు చేశారని చెప్పాలి. ప్రభుత్వ ఉద్దేశాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాల్ని ముఖ్యమంత్రి అనువుగా మార్చుకున్నారనే చెప్పాలి.

విపక్షాలతో పోలిస్తే.. అధికారపక్షం పైచేయి ఈ శీతాకాల సమావేశాల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. సమస్య ఏదైనా సరే.. చర్చకు రెఢీ అనటం ద్వారా అధికారపక్షం ఏ విషయం మీదైనా పారిపోవటం లేదన్న అభిప్రాయాన్ని కలిగేలా చేయగలిగారు. అదే సమయంలో.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులతో గడిపిన కేసీఆర్.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పక్కాగా సిద్ధం చేసినట్లుగా చెప్పొచ్చు.

ప్రతి అంశానికి కేసీఆర్ ముందుండి మరీ నడిపించటం.. కొంతమంది మంత్రులు మధ్యలోకాస్త తడబడినా.. వెంటనే తాను చొరవ తీసుకొని పరిస్థితి కంట్రోల్ తప్పకుండా చూడటం లాంటివి చేశారని చెప్పాలి. ఇక.. ఈ సమావేశాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో లేనప్పుడు.. ఆయన స్థానాన్ని మంత్రి కేటీఆర్ భర్తీ చేశారని చెప్పాలి. గతంలో కేటీఆర్.. హరీశ్ రావులు ఇద్దరూ ఆ బాధ్యత తీసుకోగా.. ఈసారి హరీశ్ తో పోలిస్తే.. కేటీఆర్ తనదైన చొరవను ప్రదర్శించటమే కాదు.. విపక్షాల్ని ధీటుగా ఎదుర్కొన్నారన్న భావన వ్యక్తమయ్యేలా చేశారని చెప్పాలి.

ఏదైనా అంశం విషయంలో విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి ఆందోళన చేస్తుంటే.. వారిపై క్రమశిక్షణ చర్యలంటూ కత్తిని దూసే విధానాన్ని కేసీఆర్ సర్కారు పక్కన పెట్టినట్లుగా కనిపించింది. ఈ సమావేశాల్లో అధికారపక్షం ఆచితూచి వ్యవహరించినట్లుగా కనిపించింది. విపక్షాల్ని బుజ్జగించటం.. అదును చూసుకొని విరుచుకుపడటం లాంటి వాటితో.. మొత్తంగా తనదే పైచేయి అనిపించేలా చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News