అవ‌త‌ర‌ణ వేళ‌.. కేసీఆర్ ప్ర‌సంగం ఎలా సాగిందంటే..?

Update: 2019-06-02 06:01 GMT
తెలంగాణ ఆవిర్భ‌వించి నేటికి ఐదేళ్లు. ఐదేళ్ల అనంత‌రం తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేళ నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్ లో వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు త‌మ‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఐదేళ్ల వ్య‌వ‌ధిలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించింద‌ని.. అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగ‌మిస్తోంద‌న్నారు.

ఆవిర్భావ వేడుక‌ల్లో పాల్గొన‌టానికి ముందు గ‌న్ పార్క్ లో అమ‌ర‌వీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్క‌రించిన ఆయ‌న ఏమ‌న్నారంటే..

+  చిత్తశుద్ధితో కరెంట్‌ సమస్యను పరిష్కరించాం. జూలై చివరినాటికి మిషన్‌ భగీరథ పూర్తవుతుంది.

+  వృద్ధులు, వితంతులు, వికలాంగులకు ఆసర పథకం అండగా నిలుస్తోంది. ఈనెల నుంచి పెంచిన పెన్షన్లను ఇస్తాం. వ్యవసాయ, పరిశ్రమ రంగాలు పురోగతి సాధించాయి. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశాం.

+  చేనేతల సమస్యలు చాలా వరకు పరిష్కరించాం. విద్య, వైద్య రంగాల్లో ప్రమాణాలు మెరుగుపర్చాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగుపర్చాం. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యం.

+  కృష్ణా, గోదావరిపై పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. కాళేశ్వరం తెలంగాణ తలరాతను మార్చబోతోంది. రెండేళ్లలోనే ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్మించడం తెలంగాణ సమర్థతకు నిదర్శనం. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరదాయిని.

+  డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. విద్య, వైద్య ప్రమాణాలను మెరుగుపరిచాం.

+  డయాలసిస్ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశాం.

+  కంటి వెలుగు పథకం చాలా మందికి వెలుగునిచ్చింది.

+  తాగునీటి కోసం ఓ నాడు తెలంగాణ కన్నీరుపెట్టింది. రైతన్న కలలను నెరవేర్చేందుకు గోదావరిపై భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం.

+  అతితక్కువ సమయంలో నిర్మితమైన ప్రాజెక్టుగా కాళేశ్వరం రికార్డుకెక్కనుంది.

+  కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవడంలో సఫలీకృతమయ్యాం. గోదావరి జలాలతో రైతుల బతుకులు బాగుపడే రోజు దగ్గరలో ఉంది.

+   తెలంగాణలో కరువు అనే మాట ఇకపై వినిపించదు. తెలంగాణ అన్నపూర్ణగా అవతరించనుంది.

+  విద్యుత్ సంక్షోభాన్ని ఛేదించాం. మిషన్ భగీరథ పనులు పూర్తి కావొచ్చాయి.

+  మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10లక్షల ఎకరాలకు నీరు అందించగలిగాం. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకున్నాం. ప్రపంచంలోనే వేగంగా నిర్మించే ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రలో నిలవబోతోంది.

+  సీతారామ ఎత్తిపోతల పథకం యుద్ధప్రతిపాదికన జరుగుతోంది.

+  రైతు బీమా కింద రైతు మరణిస్తే రూ.5లక్షలు అందిస్తున్నాం. రైతు బీమా పథకానికి ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది.

+  జీవనం దుర్భరమైతే సంపద, పరిజ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. సస్యశ్యామ సమశీతల తెలంగాణను ఆవిష్కరించుకోవాలి.

+  స్థానిక సంస్థల పనితీరు మెరుగుకు పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చాం.

+  స్థానిక సంస్థలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు వస్తాయి. గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండకూడదు.

+  పాలనలో జవాబుదారీతనం కోసం పురపాలక చట్టాన్ని తెస్తున్నాం. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైంది. అవినీతిని పార‌దోలితే.. పాలన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది.


Tags:    

Similar News