ఎల్ఆర్ఎస్ కు కొత్త లెక్క చెప్పిన కేసీఆర్

Update: 2020-09-25 06:00 GMT
భారీ కసరత్తుతో ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయంపై పలు రకాల వాదనలు వినిపించాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి తాజాగా వెల్లడించిన ఎల్ఆర్ఎస్ స్కీం పుణ్యమా అని పెద్ద ఎత్తున కాసులు ఖజానాకు చేరతాయన్న విశ్లేషణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూముల క్రమబద్ధీకరణతో పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాదన్నారు.

రాష్ట్రంలోని అన్ని పట్టణాలు.. పల్లెల్లో దశాబ్దాల పాటు నివాస స్థలాలకు సంబంధించిన సమస్యలు అలానే ఉండిపోయాయని.. అలాంటి వాటి ఆస్తి సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికి ఆన్ లైన్ లో నమోదు కానీ ప్రజల ఇళ్లు.. ప్లాట్లు.. అపార్ట్ మెంట్లు.. వ్యవసాయేతర వివరాల నమోదులో భాగస్వామ్యం కావాలని నేతల్ని కోరారు.

నిరుపేదలకు ఇబ్బందులు కలగకుండా చూడటమే తమ ముందు ఉన్న లక్ష్యమన్న సీఎం కేసీఆర్.. కొత్త చట్టాల వల్ల ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది కలగకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు పడిపోతాయని.. గిట్టని వాళ్లు శాపాలు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

వారి అంచనాల్ని తలకిందులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ.. వ్యవసాయేతర భూముల ధరలు విపరీతంగా పెరిగిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావటానికి తీసుకొచ్చే చట్టాల్లో పేదలకే అత్యధిక ప్రాధాన్యం తాము ఇస్తామని చెప్పారు. కొత్త చట్టంతో పేదల ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తుందని.. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్ పుస్తకాలు.. వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ పాస్ బుక్కుల్ని ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి అంగుళం ఆస్తిని ఆన్ లైన్ చేస్తామని చెప్పిన కేసీఆర్.. ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు.
Tags:    

Similar News