మళ్ళీ బొబ్బిలి ఎంపీ సీటు...ఎవరికి లక్ ?
ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొబ్బిలి పార్లమెంట్ సీటు ఉండేది. ఈ సీటు నుంచి పోటీ చేయడం అంటే అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిని చూపించేవి.;
ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొబ్బిలి పార్లమెంట్ సీటు ఉండేది. ఈ సీటు నుంచి పోటీ చేయడం అంటే అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిని చూపించేవి. బొబ్బిలి ప్రాంత రాజకీయ సామాజిక చారిత్రక నేపథ్యం చూసినపుడు ప్రతీ సారీ ఇక్కడ ఎన్నిక ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటూ వచ్చేది. బొబ్బిలి ఎంపీ సీటు 2009 దాకా కొనసాగింది అయితే పునర్ విభజనలో అది కాస్తా విజయనగరం ఎంపీ సీటుగా మారిపోయింది. దాంతో ఇప్పటికి నాలుగు ఎన్నికల నుంచి విజయనగరమే లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే లోక్ సభ సీట్లు పునర్ విభజనతో కొత్తగా మరిన్ని వస్తాయని అంటున్నారు. దాంతో తిరిగి బొబ్బిలి సీటుని పునరుద్ధరిస్తారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ :
బొబ్బిలి లోక్ సభ సీటు 1967లో ఏర్పాటు అయింది. అది లగాయితూ 2009లో రద్దు అయ్యేంతవరకూ 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒక ఉప ఎన్నిక కూడా జరిగింది. ఇక కాంగ్రెస్ మొదట్లో గెలిచినా టీడీపీ రంగప్రవేశంతో ఆ పార్టీకి కూడా జనాదరణ ఇక్కడా బాగా లభించింది. అలా బొబ్బిలిలో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా రసవత్తరమైన పోరు సాగుతూ వచ్చింది. ఇక కాంగ్రెస్ నుంచి పూసపాటి వారి కుటుంబం ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తే తరువాత కలాంలో బొత్స సత్యనారాయణ ఒకసారి ఆయన సతీమణి ఝాన్సీ ఒకసారి ఎంపీలుగా గెలిచారు. టీడీపీ నుంచి కొండపల్లి పైడితల్లి నాయుడు మూడు సార్లు గెలిచి ఆ పార్టీ పట్టు పెంచారు.
ఉత్తరాంధ్రాలో మార్పు :
ఇక లోక్ సభ సీట్లు విభజన జరిగితే ఉత్తరాంధ్రాలో ప్రస్తుతం ఉన్న అయిదు ఎంపీ సీట్లు కాస్తా ఏడు లేదా ఎనిమిది అవుతాయని అంటున్నారు. అందులో విశాఖ జిల్లాలో మరో ఎంపీ సీటు వస్తుందని అంటున్నారు అలాగే ఎస్టీలకు ఒక ఎంపీ సీటు లభిస్తే బొబ్బిలి విజయనగరం జిల్లాలో ఇంకో ఎంపీ సీటు అవుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో చాలా మంది బొబ్బిలి సీటు మీద ఆశలను ఇప్పటి నుంచే పెంచుకుంటున్నారు. కొండపల్లి కుటుంబం నుంచి టీడీపీలో అపుడే సందడి కనిపిస్తోంది. అలాగే బొబ్బిలి రాజులు టీడీపీలోనే ఉన్నారు. సోదరులు ఇద్దరిలో బేబీ నాయన బొబ్బిలి ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు అయితే గతంలోనే విజయనగరం సీటు కోరారు అని ప్రచారం సాగింది. ఇపుడు తమ సంస్థానంలోనే లోక్ సభ సీటు ఏర్పాటు అయితే ఆయన పోటీకి సుముఖంగా ఉంటారు అని అంటున్నారు.
బొత్స ఫ్యామిలీ ఫోకస్ :
ఇక విజయనగరం జిల్లాలో మంచి పట్టు ఉన్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తమ కుటుంబం నుంచి ఒకరిని బొబ్బిలి లోక్ సభకు పోటీకి దించుతారు అని అంటున్నారు. ఒకవేళ వారూ వీరూ కాకపోతే ఆయన కూడా పోటీకి దిగే సూచనలు ఉన్నాయని కూడా చర్చ సాగుతోంది. ఎందుకంటే బొత్స వారసులు ఈసారి అసెంబ్లీ వైపు చూస్తున్నారు దాంతో పార్లమెంట్ కి వెళ్ళాలని బొత్స అనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. విజయనగరం ఎంపీ సీటు మాజీ ఎంపీ వైసీపీ నేత బెల్లాన చంద్రశేఖర్ కి ఇస్తే బొబ్బిలి నుంచి బొత్స నేరుగా రంగంలో ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. దాంతో బొబ్బిలి యుద్ధానికి 2029 లో అంతా రెడీ అవుతోంది అని అంటున్నారు.