ఐపీఎల్ 2026: టాప్-4 రేస్‌లో ఎవరు ముందంజ? ప్లే ఆఫ్స్‌కు ఫేవరెట్లు ఎవరు?
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే అసలైన మజాను అందిస్తోంది. కేవలం రెండు, మూడు మ్యాచ్‌లు ముగిసేసరికే పాయింట్ల పట్టికలో సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి.;
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే అసలైన మజాను అందిస్తోంది. కేవలం రెండు, మూడు మ్యాచ్‌లు ముగిసేసరికే పాయింట్ల పట్టికలో సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. గత సీజన్ జోరును ఈసారి కూడా కొనసాగిస్తూ కొన్ని జట్లు టైటిల్ ఫేవరెట్లుగా కనిపిస్తుండగా మరికొన్ని బలమైన జట్లు గెలుపు ఖాతా తెరవడానికి కష్టపడుతుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుత ఫామ్ , పాయింట్ల ఆధారంగా టాప్-4 రేసులో ఎవరున్నారో ఒకసారి విశ్లేషిద్దాం.
అగ్రస్థానంలో పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ
గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో కూడా అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలవడమే కాకుండా ప్లే ఆఫ్స్ రేసులో అందరికంటే ముందంజలో ఉంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా తగ్గేదేలే అంటోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ తమ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకుంటోంది. ఈ రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత సమతూకంగా కనిపిస్తున్నాయి.
రేసులో నిలుస్తున్న రాజస్థాన్, ఢిల్లీ
మూడు, నాలుగు స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతున్నాయి. రాజస్థాన్ జట్టు తన యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచగా ఢిల్లీ జట్టు అనుభవజ్ఞులైన సీనియర్ల అండతో దూసుకుపోతోంది. ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్స్ స్థానం కోసం గట్టి పోటీనిచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రాజస్థాన్ బౌలింగ్, మిడిల్ ఆర్డర్‌లో ఢిల్లీ బ్యాటింగ్ ఈసారి వారికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ , ముంబై పరిస్థితి ఏంటంటే?
తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండటం గమనార్హం. అంటే ఇతర జట్లు కూడా వరుస ఓటములను చవిచూడటంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇంకా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అయితే టాప్-4లో స్థానం దక్కించుకోవాలంటే తర్వాతి మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడి వారిపై ఉంది.
ఇక ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆరో స్థానంలో ఉంది. ముంబైకి ఆరంభంలో స్లోగా మొదలుపెట్టి తర్వాత పుంజుకోవడం అలవాటే. కానీ ప్రస్తుత పోటీని బట్టి చూస్తే వారు తమ విన్నింగ్ మొమెంటమ్‌ను త్వరగా అందుకోవాల్సి ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఏడో స్థానంలో ఉండి గట్టి పోటీనిస్తోంది.
సంక్షోభంలో దిగ్గజ జట్లు
ఈ సీజన్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం ఏమిటంటే.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), గుజరాత్ టైటాన్స్ వంటి బలమైన జట్లు ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోవడం.సీఎస్కే ధోనీ వారసత్వంతో బరిలోకి దిగినప్పటికీ సరైన ఫినిషింగ్ లేక ఇబ్బంది పడుతోంది. కేకేఆర్ బౌలింగ్ విభాగంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.గుజరాత్ టైటాన్స్ కీలక ఆటగాళ్ల ఫామ్ లేమి జట్టును వేధిస్తోంది.
ప్లే ఆఫ్స్ ఫేవరెట్లు ఎవరు?
ప్రస్తుతానికి పంజాబ్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు 80 శాతం పైగా కనిపిస్తున్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం రాజస్థాన్, ఢిల్లీ, ముంబై , హైదరాబాద్ మధ్య తీవ్రమైన పోరు నెలకొనే అవకాశం ఉంది. ఐపీఎల్ అంటేనే ఆఖరి బంతి వరకు ఉత్కంఠకు మారుపేరు. ఒక్క సెంచరీ లేదా ఒక్క అద్భుతమైన బౌలింగ్ స్పెల్ మొత్తం పాయింట్స్ టేబుల్‌ను తలకిందులు చేయగలదు. కాబట్టి సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యే లోపు జట్లు తమ వ్యూహాలను మార్చుకోకపోతే దిగ్గజ జట్లకు కూడా ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయే ప్రమాదం ఉంది.