చిల్లర పైసల మీద ఈ పంచాయితీ ఏంది కమల్?

తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశావాహులు రూ.50వేలు చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించి అప్లికేషన్ పెట్టుకోవాలని కోరారు.;

Update: 2026-04-07 05:28 GMT

చిన్న చిన్న అంశాలే చిలికి చిలికి గాలివానలా మారుతుంటాయి. అప్పటివరకు తమకున్న ఇమేజ్ ను పూర్తిగా దెబ్బ తినేలా కొందరు ప్రముఖులు వ్యవహరిస్తుంటారు. ఆ మొండితనం ఎందుకో? అర్థం కానట్లుగా ఉంటుంది. తాము వినిపించే వాదన న్యాయంగా.. ధర్మంగా ఉంటుందా? అన్న విషయాల్ని తర్కబద్ధంగా ఆలోచిస్తే.. అసలు పంచాయితీనే ఉండదన్న సూక్ష్మాన్ని మిస్ అవుతుంటారు. తాజాగా విశ్వనటుడిగా పేరున్న మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తీరు ఇలానే ఉంది. తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశావాహులు రూ.50వేలు చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించి అప్లికేషన్ పెట్టుకోవాలని కోరారు.

అధినేత కమల్ హాసన్ మాటలకు తగ్గట్లే. పార్టీకి చెందిన పలువురు టికెట్ ఆశావాహులు రూ.50 వేల చొప్పున చెల్లించి.. తాము ఆసక్తి చూపుతున్న నియోజకవర్గాలకు సంబంధించిన దరఖాస్తుల్ని పెట్టుకున్నారు. అయితే.. అధికార పార్టీ డీఎంకేతో ఉన్న పొత్తు వేళ.. కమల్ కోరినన్ని సీట్లు కేటాయించే విషయంలో డీఎంకే నో చెప్పటం ఒక ఎత్తు అయితే.. ఒకవేళ పోటీకి దిగేందుకు సిద్ధమైతే.. తమ పార్టీ గుర్తు మీద ఎన్నికల బరిలోకి దిగాలన్న సూచన చేసింది.

దీంతో.. డీఎంకే గుర్తుకు తన పార్టీ అభ్యర్థులు పోటీకి దిగేందుకు ససేమిరా అన్న కమల్ హాసన్.. ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని.. మిత్రపక్షం డీఎంకేకు తమ మద్దతు ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పార్టీకి చెందిన కొందరు నేతలు..ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలన్న కమల్ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికల్లో టికెట్ల కోసం ఆశావాహులు చెల్లించిన రూ.50 వేల మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. పోటీ కోసం దరఖాస్తులు పెట్టామని.. పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్న నేపథ్యంలో.. తాము చెల్లించిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేయాలన్న పార్టీ నేతల మాటకు కమల్ భిన్నంగా స్పందించారు.

ఆశావాహులు దరఖాస్తు రుసుముగా చెల్లించిన నగదును తిరిగి ఇవ్వాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారమే తప్పించి.. మరేమీ లేదన్న కమల్ హాసన్.. ఇదంతా తన ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పుడు ప్రచారంగా పేర్కొన్నారు. అదే సమయంలో పార్టీ నేతలు చెల్లించిన దరఖాస్తు రుసుములు పార్టీకి చెందుతాయని.. నగదును తిరిగి ఇవ్వాలని ఎవరూకోరుకోవటం లేదని పేర్కొన్నారు.

దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించేది కాదనే విషయం అదరికి తెలుసని.. ఆ మొత్తం పార్టీ ఫండ్ కు వెళుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదంతా చూసినప్పుడు.. చిల్లర అంశాలకు పంచాయితీలు అవసరమా? అన్న సందేహం కలుగకమానదు. పార్టీ టికెట్ కోసం రుసుము చెల్లించి అప్లికేషన్ పెట్టుకోవటం అంటే.. పోటీకి దిగుతున్నట్లే కదా? ఒకవేళ పోటీకి దూరంగా ఉంటే.. ఆశావాహులు ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తే జరిగే నష్టం కంటే.. ఈ చిల్లర పంచాయితీతోనే డ్యామేజ్ ఎక్కువన్న చిన్న విషయాన్ని కమల్ అండ్ కో ఎందుకు గుర్తించటం లేదన్నది అసలు ప్రశ్న.

Tags:    

Similar News