‘అమరావతి’కి రాష్ట్రపతి రాజముద్ర..ఇకపై మార్చాలంటే?
చట్టం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. పరిణామాలు ఎంత వేగంగా జరిగిపోతాయన్న దానికి ఏపీ రాజధానిగా అమరావతిని డిసైడ్ చేసే ఉదంతంగా చెప్పాలి.;
చట్టం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. పరిణామాలు ఎంత వేగంగా జరిగిపోతాయన్న దానికి ఏపీ రాజధానిగా అమరావతిని డిసైడ్ చేసే ఉదంతంగా చెప్పాలి. ఏపీ అసెంబ్లీలో బిల్లు పెట్టటంతో మొదలైన ఈ ప్రయాణం.. లోక్ సభ.. రాజ్యసభ.. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదం.. అనంతరం కేంద్ర నోటిఫికేషన్.. తదనంతరం రాష్ట్రపతి తాజాగా వేసిన రాజముద్రతో ఏపీ రాజధాని అమరావతి కథ సుఖాంతమైంది. ఇకపై.. ఏపీ రాజధాని అమరావతి అన్నది చట్ట రూపం దాల్చింది. భారతదేశంలోని మరే రాష్ట్ర రాజధానికి లేని విధంగా అమరావతికి చట్టబద్ధత కల్పించేలా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరిస్తూ కేంద్రహోంశాఖ ప్రవేశ పెట్టిన బిల్లు తాజాగా రాష్ట్రపతి ఓకే చెప్పేశారు.
తాజా చట్టంతో అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తింపు ఇవ్వటంతో పాటు.. ఇందుకు 2024 జూన్ 2 నుంచి అన్న అంశాన్ని చేర్చారు. తాజాగా అమరావతి బిల్లు చట్టరూపం సంతరించుకున్న విషయాన్ని ప్రకటిస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అమరావతి కిందకు సీఆర్ డీఏ చట్టం కింద నోటిఫై అయిన ప్రాంతాలన్నీ కూడా వస్తాయని చట్టంలో స్పష్టం చేశారు. అంతేకాదు.. ఈ అంశంపై భవిష్యత్తులో ఎలాంటి వివాదం తలెత్తకుండా ఉండేలా తాజాగా జరిపిన చట్టసవరణలో వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత డెవలప్ మెంట్ ప్రాధికార సంస్థ చట్టం 2014 కింద నోటిఫై చేసిన రాజధాని ప్రాంతాలన్నీ కలిపి.. అమరావతి కిందకు వస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇందులో ఏ మార్పుచేర్పులు చేయాలన్నా పార్లమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ.. అందుకు భిన్నంగా అసెంబ్లీ చేసే సవరణలకు చట్టబద్ధమైన విలువ ఉండదు. మరి.. ఏపీ విపక్షం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ‘మావిగన్’ పరిస్థితి ఏంటి? దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
అమరావతి విషయంలో మొదట్నించి భిన్నమైన వాదనను వినిపిస్తున్న జగన్.. తాము ఏపీ రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదని.. కానీ మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) ఏపీ రాజధానిగా మారితే డెవలప్ మెంట్ డబుల్ స్పీడ్ తో దూసుకెళుతుందన్న వాదనను వినిపించటం తెలిసిందే. అమరావతికి చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో.. భవిష్యత్తులో మావిగన్ ఎలా ఉంటుంది? అన్నది ఒక ప్రశ్నగా మారింది. ఇప్పుడు మాట్లాడినట్లే..ఒకవేళ జగన్ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే.. అసెంబ్లీలో బిల్లుప్రవేశ పెట్టి.. దాన్ని పాస్ చేస్తే సరిపోదు. దీనికి పార్లమెంట్ ఆమోదం ఉండాల్సిందే.
వాస్తవ అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే.. జగన్ కోరుకున్నట్లు మావిగన్ రాజధానిగా గుర్తింపు పొందటం.. చట్టబద్ధం కావటం అత్యంత కష్టమైన ప్రక్రియగా చెప్పాలి. భవిష్యత్తులో కేంద్రంలో కొలువు తీరే ప్రభుత్వానికి జగన్ పార్టీ గెలిచిన ఎంపీ సీట్లు (అప్పటికి) అత్యంత కీలకమై.. ఆ సీట్లే ఆ ప్రభుత్వానికి ఆక్సిజన్ గా మారితే తప్పించి.. అమరావతికి ఎలాంటి అడ్డంకి ఉండదు. ఇప్పుడు చెప్పిన పరిస్థితి దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీనికి తోడు.. పార్లమెంటు ఉభయ సభల్లో దేశంలోని పెద్దఎత్తున ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా తమ వైఖరిని.. సానుకూలతను స్పష్టం చేశాయి.
జగన్ నోట వచ్చిన మావిగన్ మాటను వాస్తవ రూపం దాల్చే విషయంలో తమ మద్దతు ప్రకటించేందుకు జాతీయ స్థాయిలో పార్టీలు సుముఖంగా ఉండే వీలు చాలా చాలా తక్కువ. చివరగా చెప్పేదేమంటే.. మావిగన్ అసాధ్యం కాదనే కంటే.. మాటల్లో చెప్పినంత సులువు కానే కాదు. అత్యంత ప్రత్యేక పరిస్థితులు చోటు చేసుకుంటే.. ఎలా అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్ తలుపులు మూసి.. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల్ని నిలిపేసి మరీ బిల్లును ఆమోదించారో.. అలాంటి పరిస్థితులు ఉండాలి. అదంత తేలికగా అయ్యే వీలుందా? అన్నదే అసలు ప్రశ్న.