ట్రంప్ తుది హెచ్చరిక వేళ.. ఈ రాత్రికి ఏం జరగనుంది?
మరి..ఈ ఆఖరి హెచ్చరికల గడువు ముగిసే కొన్ని గంటల ముందు నాటకీయ పరిణామాలుచోటు చేసుకుంటాయా? అన్నది ఒక ప్రశ్న.;
ఫిబ్రవరి 28న మొదలైన పశ్చిమాసియా యుద్ధం చూస్తుండగానే.. ఏప్రిల్ ఏడో తేదీ వరకు వచ్చేసింది. మూడు.. మహా అయితే నాలుగు వారాల్లో ఇరాన్ ను దారికి తెస్తానని చెప్పిన అగ్రరాజ్యం అమెరికా, దాని మిత్రుడు ఇజ్రాయెల్ వారు వేసుకున్న అంచనాలకు భిన్నంగా యుద్ధం సాగుతూనే ఉంది. హోర్మూజ్ జలసంధిని పూర్తిగా నియంత్రిస్తున్న ఇరాన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు మంటలు పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి ప్రపంచ గమనాన్ని తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి.
ఇలాంటి వేళ.. తాము చెప్పినట్లుగా హోర్మూజ్ జలసంధిని విడిచి పెట్టటంతో పాటు.. తాము చెప్పిన విధివిధానాలకు అంగీకరించాలని.. అందుకు తుది గడువును మంగళవారం రాత్రి వరకు అమెరికా అధ్యక్షుడు ఇవ్వటం తెలిసిందే. 45 రోజుల కాల్పుల విరమణ విషయంలో ఇప్పటికే మధ్యవర్తులుగా ఉన్న ఈజిప్టు.. పాకిస్తాన్.. తుర్కియే దేశాల ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించటం తెలిసిందే. అదే సమయంలో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడ్డాయి. తాము చెప్పినట్లుగా ఇరాన్ వినకుంటే.. తుడిచిపెట్టుకుపోతుందన్న భీకర వ్యాఖ్యలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు.
ఇంత తీవ్ర హెచ్చరికలు చేస్తున్న అగ్రరాజ్య అధినేత మాటల్ని పెద్దగా పట్టనట్లుగా ఇరాన్ వ్యవహరిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా.. యుద్ధం మొదలైన మొదటి రోజున ఇరాన్ సుప్రీం హతమైతే.. సోమవారం ఇరాన్ నిఘా విభాగం అధిపతి మరణించిన పరిస్థితి. ఇప్పటికే ఇరాన్ ను నడిపించే నాయకత్వం.. సైనిక విభాగంలోని పలువురు ముఖ్యులు ప్రాణాలు పోగొట్టుకోవటం తెలిసిందే.
మరోవైపు.. ట్రంప్ ఇచ్చిన తుదిగడువు భారత కాలమానం ప్రకారం చూస్తే.. బుధవారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటల వేళలో ముగుస్తుంది. ఇరాన్ స్థానిక సమయం ప్రకారం చూస్తే.. మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు ముగుస్తుంది. హర్మూజ్ జలసంధిని తెరవటానికి, యుద్ధాన్ని ముగించటానికి ఇరాన్ ముందున్న ఆఖరి అవకాశం ఇదేనని చెబుతున్నారు. మరి..ఈ ఆఖరి హెచ్చరికల గడువు ముగిసే కొన్ని గంటల ముందు నాటకీయ పరిణామాలుచోటు చేసుకుంటాయా? అన్నది ఒక ప్రశ్న. అలాంటిదేమీ లేకుండా ఉండే.. ఇరాన్ కు ఈ రాత్రి ఎలా ఉంటుంది? ప్రపంచాన్ని ఏ దిశగా తీసుకెళుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఈ రాత్రిపై ట్రంప్ ఇప్పటికే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిని చూస్తే..
- గడువులోగా ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తాం. "పవర్ ప్లాంట్ డే మరియు బ్రిడ్జ్ డే"గా అభివర్ణించటం తెలిసిందే.
- ఇరాన్‌ను "ఒక్క రాత్రిలో దెబ్బకొట్టగలం". గడువు పూర్తైన తర్వాత జరిగే దాడులతో ఇరాన్ కోలుకోవడానికి వందేళ్లు పడుతుంది.
ట్రంప్ ఇచ్చిన తుది గడువు పూర్తైన తర్వాత.. ఇప్పటిలానే అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి ఇరాన్ ససేమిరా అన్నపక్షంలో ఏం జరుగుతుంది? యుద్ధం ఏ దిశలోకి వెళుతుంది? అమెరికా, ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తాయి? దానికి ఇరాన్ ప్రతిస్పందన ఏంటి? యుద్ధం ఎలాంటి దశకు చేరుకుంటుంది? ఇరాన్ కు జరిగే నష్టం ఎంత? అక్కడి ప్రజల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలతో పాటు.. ఇంత జరుగుతున్న వేళ.. మిగిలిన ప్రపంచం మొత్తం మౌనంగా.. తనకు సంబంధం లేదన్నట్లు ఉంటుందా? ఏమైనా పరిణామాలు జరుగుతాయా? అన్న ప్రశ్నలు తలెత్తే పరిస్థితి.
ఈ రాత్రికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న దానిపై యుద్ధరంగ నిపుణుల అంచనాలు.. ఇప్పటివరకు జరిగిన యుద్ధాన్ని చూసిన నేపథ్యంలో వచ్చిన అంచనాలు ఇలా ఉన్నాయి. ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. ట్రంప్ తన మాటల్లో తీవ్రతను మాటల్లో ఎంతలా చెప్పినా.. చేతల్లో చూపించే అవకాశాలు కొంతమేర మాత్రమే.
అంచనా 1
అమెరికా అధినేత చెప్పినట్లు తన అత్యాధునిక క్షిపణులు. డ్రోన్లతో ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బ తీసే అవకాశం ఎక్కువ. అంటే.. ఇరాన్ లోని విద్యుత్ గ్రిడ్లు.. కమ్యూనికేషన్ వ్యవస్థలు.. చమురు శుద్ధి కర్మాగారాలను అమెరికా లక్ష్యంగా చేసుకునే వీలుంది. ఈ పరిణామాలతో ఇరాన్ ప్రజల్లో అసంతృప్తి పెరిగి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నది అగ్రరాజ్య ఆలోచనగా చెబుతున్నారు. అయితే.. దీనికి ఇరాన్ ప్రతిస్పందన ఏమిటి? అన్నది చూస్తే.. తన వద్ద ఉన్న ఖైబర్ షెకాన్ లాంటి మధ్యంతర శ్రేణి క్షిపణులతో ఇజ్రాయెల్ లోని కీలక నగరాలపై దాడులు చేసే వీలుంది.
అంచనా 2
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికాతో నేరుగా తలపడటం కన్నా.. తనకున్న ప్రాక్సీ (హిజ్జుల్లా.. హౌతీలు) బలగాల్ని రంగంలోకి దించటం. అదే సమయంలో హోర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయటం. అదే జరిగితే ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20 శాతం నిలిచిపోతుంది. దీంతో గ్లోబల్ మార్కెట్ లో పెట్రోల్ ధరలు ఊహించని స్థాయికి చేరుతాయి. ఇది అగ్రరాజ్యంతో పాటు మిగిలిన దేశాలపై తీవ్ర ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. అదే సమయంలో ఇరాన్ తన వద్ద ఉన్న వేలాది కామికేజ్ డ్రోన్లు.. సముద్ర గనులను ఉపయోగించి అమెరికా యుద్ధ నౌకల్ని అడ్డుకునే ప్రయత్నం చేయటం. దీంతో.. యుద్ధం మరింత వినాశన దిశగా పయనిస్తుంది.
అంచనా 3
గడువు ముగిసిన వెంటనే ట్రంప్, ఇజ్రాయెల్ తమ నైట్ ఆఫ్ రివెంజ్ దాడుల్ని తీవ్రం చేయటం. దీంతో పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధానికి తెర తీయటం. దీనికి ప్రతిగా ఇరాన్ తన భూగర్భ క్షిపణి కేంద్రాల నుంచి ఇజ్రాయెల్ వైపు ఒకేసారి వందల సంఖ్యలో క్షిపణుల్ని ప్రయోగించే అవకాశం. దీన్ని ఎదుర్కోవటానికి అమెరికా తన థాడ్ రక్షణ వ్యవస్థనను వాడే వీలుంది. తన వద్ద ఉన్న హైపర్ సోనిక్ క్షిపణలతో ఇరాన్ విరుచుకుపడి.. ఇజ్రాయెల్ రక్షణ కవచాలను ఛేధించేలా చేయటం. అయితే.. అమెరికా గగనతల అధిపత్యం ముందు ఇరాన్ వైమానిక దళం నిలిచే అవకాశం తక్కువ.
ఈ మూడు అంచనాల్నిచూస్తే.. ఇరాన్ పతనం పూర్తిగా ఒక్క రాత్రికే సాధ్యం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా చెబుతున్నారు. అమెరికా సాంకేతికత కారణంగా ఇరాన్ తీవ్రంగా దెబ్బ తినే వీలుంది. అదే సమయంలో ఇరాన్ వద్ద ఉన్న క్షిపణి సంపద ఇజ్రాయెల్.. మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశాల్ని కొట్టిపారేయలేం. మొత్తంగా చూస్తే.. ఈ రాత్రి ట్రంప్ చెప్పినట్లు ఇరాన్ లోని మౌలిక వసతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు.