మోడీకి చుక్కలు చూపించే ఆస్త్రం కేసీఆర్ చేతికి

Update: 2020-09-29 05:30 GMT
అందుకే అంటారు.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావటం అంతా కాలం చేతిలోనే ఉంటుంది. అప్పటివరకు తిరుగులేని అధికారంలో ఉన్న వారు రోజుల వ్యవధిలోనే వారి చేతిలో ఉండే అధికారాలు దూరమైపోవటం ఇప్పటికే చాలా సందర్భాల్లో చూశాం. రాజకీయాలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారుకు కొత్త తిప్పలు తప్పవా? అన్న సందేహం కలుగక మానదు.

అదే సమయంలో.. మోడీ సర్కారుపై తనకున్న కోపాన్ని.. ఆగ్రహాన్ని సమయం.. సందర్భం చూసుకొని విరుచుకుపడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సరికొత్త ఆయుధం ఒకటి లభించిందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. మోడీ సర్కారు కొలువు తీరిన నాటి నుంచి కేంద్రం తన పరిధుల్ని దాటేస్తుందని.. రాష్ట్రాల మీద పట్టు కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విమర్శలు.. ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని కేసీఆర్ సైతం పలు దఫాలు ప్రస్తావించారు.

అన్నింటికి మించి.. రాష్ట్రాలకు న్యాయపరంగా రావాల్సిన నిధుల విషయంలోనూ కేంద్రం కోత పెట్టటాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. జీఎస్టీ నష్టపరిహారం కోసం పలు రాష్ట్రాలు గట్టిగా అడుగుతున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సీఎం పలుమార్లు ప్రస్తావించారు కూడా. పలు దక్షిణాది రాష్ట్రాలతో పాటు.. పశ్చిమబెంగాల్.. ఒడిశా ప్రభుత్వాలు జీఎస్టీ నష్టపరిహారం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై గుర్రుగా ఉన్నాయి.

రాష్ట్రాలు చేస్తున్న క్లెయిమ్ లు.. కేంద్రం లెక్కలకు సరిపోవటం లేదు. రాష్ట్రాలు చెబుతున్న మొత్తాల్ని అప్పు తెచ్చుకోవచ్చని మోడీ సర్కారు చెబుతుంటే.. అదే పని మీరే చేసి.. అప్పుగా తీసుకొని మాకివ్వండంటూ కేసీఆర్ ఒక దశలో గట్టిగా బదులిచ్చిన పరిస్థితి. ఇలాంటివేళ.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కాగ్ రిపోర్టు బయటకు వచ్చింది. జీఎస్టీ నష్ట పరిహారానికి సంబంధించి వసూలు చేసిన రూ.47,272 కోట్లు దారి మళ్లినట్లుగా కాగ్ రిపోర్టు స్పష్టం చేయటంతో కేసీఆర్ కు బలమైన ఆయుధం లభించినట్లేనని చెబుతున్నారు.

కాగ్ రిపోర్టు ను కేంద్రం తోసి పుచ్చుతోంది. 2017-18 లో రూ.62,611 కోట్లు వసూలు కాగా.. రాష్ట్రాలకు పరిహారం రూపంలో రూ.41, 146 కోట్లు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.95,081 కోట్లు వసూలు కాగా.. రాష్ట్రాలకు రూ.69,275 కోట్లు అందచేసినట్లుగా కాగ్ రిపోర్టు చెబుతోంది. దీంతో.. జీఎస్టీ పరిహారం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వినిపిస్తున్న వాదనకు బలం చేకూరినట్లైంది. ఇంతకాలం సరైన ఇష్యూ లేక మోడీ సర్కారు ను ఇరుకున పడేయటం లో ఇబ్బంది పడుతున్న కేసీఆర్ లాంటి వారికి.. ఇప్పుడు బలమైన ఆయుధం లభించినట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News