ఆత్మహత్యలు కేసీఆర్ కు కలిసొస్తాయా?

Update: 2015-09-19 11:12 GMT
తెలంగాణలో ప్రతిరోజూ ఐదారుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు ఆత్మహత్యలను ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. మంత్రులు ఖండిస్తున్నారు. ప్రజా సంఘాలు పౌర సంఘాలు, పత్రికలు అంతా ఖండిస్తున్నారు. రైతు ఆత్మహత్యలను తెలంగాణలోని దాదాపు అందరూ ఖండిస్తున్నారు. కానీ, దీనిపై ఇప్పటి వరకు మాట్లాడని, స్పందించని ఒకే ఒక్క వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రమే. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రోడ్డు మీదకు వచ్చి ఉద్యమం చేయకపోయినా ఆత్మహత్యలే ఆయనకు కలిసి వచ్చాయని, ఆత్మహత్యలకు పత్రికలు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఆయనకు కలిసి వచ్చిందని, అందుకే ఇప్పుడు కూడా ఆత్మహత్యలు తనకు కలిసి వస్తాయనే భావనతోనే కేసీఆర్ స్పందించడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో వివిధ వర్గాల ఆత్మహత్యలు సర్వ సాధారణం అయ్యాయని, ఒక వర్గం తర్వాత మరొక వర్గం ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉందని వివరిస్తున్నాయి. తొలుత పింఛనుదారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వివిధ వర్గాలు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. అయినా గత ఏడాదిన్నరగా వాటిపై కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదని, తెలంగాణ ఉద్యమంలో అయినా తెలంగాణ ప్రభుత్వంలో అయినా ఆత్మహత్యలు తనకు కలిసి వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే ఆయన మాటమాత్రంగా కూడా స్పందించడం లేదని ప్రతిపక్షాలు వివరిస్తున్నాయి.
Tags:    

Similar News