మోతె ఊరు మట్టి కిలోల లెక్కన అమ్ముతారా?

Update: 2015-07-06 10:15 GMT
విమర్శలు చేస్తే తాను మాత్రమే చేయాలి. ఒకవేళ అగ్రహం వస్తే తాను మాత్రమే తిట్టాలి. ఏదైనా సరే.. తాను మాత్రమే చేయాలని.. మరెవరూ చేయకూదని భావించే రాజకీయ ముఖ్యనేతల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకరు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఎలాంటి మాటలు అయితే మాట్లాడకూడదో అలాంటి మాటలే మాట్లాడే ఆయన.. తన విమర్శల్లో బూతుల్ని అన్యాపదేశంగా ఉపయోగించేస్తుంటారు. ఒకవేళ కేసీఆర్‌ని స్ఫూర్తిగా తీసుకొని విపక్ష నేతలు మాట్లాడితే మాత్రం నోరు కుట్టేస్తామని.. నాలుక కోసేస్తామన్న వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎందుకిదంతా అంటే తాజాగా నిజామాబాద్‌జిల్లా వేల్పూరు గ్రామంలో హరిత హారం కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అన్నీ లఫూట్‌ పథకాలు అమలు చేశారని విరుచుకుపడ్డారు.

తెలంగాణలోని ప్రాజెక్టులను రీడిజైనింగ్‌ చేయాలని చెప్పారు. నిజాం సాగర్‌ నుంచి గ్రావెటీ ద్వారా నీటిని తీసుకురావాలన్న ఆలోచనను బయటపెట్టిన కేసీఆర్‌.. మరో ఆసక్తికరమైన వ్యాఖ్యను చేశారు. తెలంగాణ ఉద్యమంలో మోతె గ్రామం (కేసీఆర్‌ సొంతూరు) కీలకభూమి పోషించిందని.. అందుకే మోతె గ్రామ మట్టిని తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని బావుల్లో కలపాలని తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పానని చెప్పారు.

ఒకవేళ నాటి మాటల్ని నేడు అమలు చేయాలన్న నిర్ణయం తీసుకుంటే మాత్రం మోతె గ్రామం సుడి తిరిగిపోతుందని చెబుతున్నారు. మోతె గ్రామంలోని మట్టిని తెలంగాణలోని అన్ని జిల్లాలు.. చెరువుల్లో కలపాలని పిలుపునిస్తే.. ఆ ఊరు మట్టి కిలోల లెక్కన అమ్మకం ఖాయమని చెబుతున్నారు. మరి.. కేసీఆర్‌ నోటి నుంచి అలాంటి మాట వస్తుందా?

Tags:    

Similar News