చంద్రబాబు ఫ్యాన్స్‌ ను గిల్లుతున్న కత్తి మహేశ్

Update: 2017-12-24 06:55 GMT
కొన్నాళ్లుగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ తో కయ్యం పెట్టుకుని నిత్యం వార్తల్లో నిలుస్తున్న సినీ క్రిటిక్ కత్తి మహేశ్ ఇప్పుడు మరికొందరు శత్రువులను సంపాదించుకుంటున్నాడు. ఈసారి ఏపీ సర్కార్ నిర్ణయాలపై విమర్శలు మొదలుపెట్టి సీఎం చంద్రబాబునాయుడు ఫ్యాన్స్‌ తో కయ్యానికి కాలు దువ్వతున్నాడు.  ఏపీ దేవాదాయ శాఖ పరిధిలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ పేరిట విడుదలైన ఆదేశాలను ఆయన ప్రశ్నించడంతో టీడీపీ - బీజేపీ అభిమానులు ఆయనపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు.
    
జనవరి 1న దేవాలయాలకు అలంకరణలు వద్దని - నూతన సంవత్సరం ఉగాది నాడు ప్రారంభమవుతుందని - క్రీస్తు శకాన్ని అనుసరించి జనవరి 1న పండుగ చేసుకోవడం సముచితం కాదని - ఆలయాల్లో పండగ వాతావరణం సృష్టించొద్దని కమిషనర్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై మహేష్ స్పందిస్తూ, "చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనం పట్టింది. రాజధాని మాత్రం అంతర్జాతీయం కావాలి. కొత్త సంవత్సరం మాత్రం జనవరిలో వద్దు. మూర్ఖత్వానికి పరాకాష్ట. హిందుత్వ రాజకీయాలకు తెరతీత. సిగ్గుసిగ్గు!" అని తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు.
    
దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో దుమారం రేగకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికే వేడి మొదలైపోయింది. కత్తి కామెంట్లను కోట్ చేస్తూ టీడీపీ అభిమానులు మండపడుతున్నారు. కత్తి తన పని తాను చేసుకోవడం మంచిదని.. అక్కర్లేని వ్యవహారాల్లో వేలు పెట్టకపోవడం మంచిదని సూచిస్తున్నారు. కత్తి మరి తన కొత్త టార్గెట్ ను ఇక్కడితో ఆపేస్తారో లేదంటే ఇంకా కొనసాగించి కొత్త తలనొప్పులు తెచ్చుకుంటారో చూడాలి.
Tags:    

Similar News