ప్రత్యేకం కోసం జేసీ..పవన్ వెంట నడుస్తారంట

Update: 2015-08-01 07:59 GMT
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పటమే కాదు.. అలాంటి ఆలోచన కూడా లేదని చెప్పిన కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఏపీ అధికారపక్ష ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పుడో తెలసంటూ బాంబు పేల్చారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే క్రమంలో.. చాలామందికి నచ్చని మాటల్ని సైతం ఓపెన్ గా చెప్పేసే గుణం ఉన్న జేసీ.. తాజాగా ప్రత్యేక హోదా మీద బాబును ఇరికించేటట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చేసిన కేంద్రం మాటతో ఏపీ ప్రజలు మండి పడుతున్న వేళ.. జేసీ మాటలు అధికార పార్టీని మరింత డ్యామేజ్ చేయటం ఖాయమంటున్నారు. ప్రత్యేక హోదా రాదన్న అంశంపై అవగాహనకు వచ్చిన చంద్రబాబు.. ప్రత్యేక నిధులపై దృష్టి సారించినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.

అన్నింటికి మించి.. ఆయన చేసిన వ్యాఖ్యల్లో కీలకమైంది.. ప్రత్యేక హోదా విషయంలో పవన్ పట్టుదలగా ఉన్నారని.. ప్రత్యేక హోదా రావాలని ఆయన కోరుకుంటున్నారని.. అందుకే టీడీపీ నేతలు ప్రత్యేకం కోసం ప్రయత్నించటం లేదన్న వ్యాఖ్యలు చేస్తున్నారన్న వ్యాఖ్య చేశారు. ప్రత్యేకం కోసం పవన్  ముందుకొస్తే.. ఆయన వెంట నడిచేందుకు తాము సిద్ధమన్న ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

ప్రత్యేకం కోసం లోక్ సభ బయటా.. లోపలా ఆందోళన చేశామని.. తాము అంతకు మించి ఇంకేం చేయగలమని వ్యాఖ్యానించారు. మాట్లలో ప్రదర్శించే చురుకు.. చేతల్లో ప్రదర్శించాలే కానీ.. ఎంత సేపటికి మేం ఏం చేయగలం? ఇంతకన్నా మా వల్ల ఏం అవుతుందన్న చేతకాని మాటలే ఏపీ వారి డిమాండ్లను చెత్త బుట్టలో పడేసేలా చేస్తున్నాయన్న విషయాన్ని జేసీ లాంటి నేతలు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.

వాళ్లు రావాలి.. వీళ్లు రావాలి.. వాళ్లు వస్తే వాళ్లతో నడుస్తామనే వారు.. వాళ్లు.. వీళ్లు వచ్చే వరకూ పదవులు వదిలేసి ఊరికే ఉండొచ్చు కదా. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడే కన్నా.. సొంతంగా ఏపీ ఎంపీలు ఏమీ చేయలేరా జేసీసాబ్..?
Tags:    

Similar News